Polavaram Project Fails In ycp Government: టీడీపీ ప్రభుత్వ హయాంలో శరవేగంగా సాగుతున్న పోలవరం ప్రాజెక్టు పనులకు.. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే బ్రేక్ పడింది. ఆ సంవత్సరం ఆగస్టులోనే అప్పటి గుత్తేదారు సంస్థను పనులు చేయకుండా ఆపేసిన ప్రభుత్వం.. జగన్ అస్మదీయ సంస్థకు అప్పజెప్పేలా పావులు కదిపింది. ఇంత ఖర్చు అవసరం లేకుండా చాలా తక్కువకే ప్రాజెక్టు కట్టేస్తామని గొప్పలకు పోయింది. ప్రధాన డ్యాంలో అప్పటికి మిగిలి ఉన్న 17వందల 71.44 కోట్ల రూపాయల విలువైన పనికి ఆగస్టు 17న కొత్త టెండర్ ప్రకటన ఇచ్చింది.
వైసీపీ ప్రభుత్వం ఏర్పడే నాటికి ఉన్న కాంట్రాక్టరు మరో 14 నెలల్లోనే ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉండగా.. కొత్త కాంట్రాక్టరుకు 24 నెలల గడువిచ్చింది. రివర్స్ టెండర్ల కోసం ఆగస్టు 16న జీవో 67 జారీ చేసి.. 2019 సెప్టెంబర్ 21 వరకు బిడ్ల దాఖలుకు అవకాశమిచ్చారు. రివర్స్ టెండర్ల నిర్వహణకు కనీసం ఇద్దరు బిడ్డర్లు ఉండాలని నిబంధన ఉన్నా.. మేఘా కంపెనీ ఒక్కటే టెండర్ వేసింది. 17వందల 71.44 కోట్ల రూపాయల విలువైన ప్రధాన డ్యాం పనులను 12.6 శాతం తక్కువతో 15 వందల 48 కోట్ల రూపాయలకే చేస్తామంటూ ఫైనాన్స్ బిడ్ వేసింది. ఈ మొత్తం ఇంటర్నల్ బెంచ్ మార్కు విలువ కంటే తక్కువగా ఉన్నందున.. రివర్స్ టెండర్లు నిర్వహించకుండానే మేఘాకు అప్పగించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
సాంకేతిక అర్హతలనూ మార్చిన జగన్ ప్రభుత్వం:పోలవరం పనులు అస్మదీయులకు అప్పగించేందుకు గుత్తేదారు సంస్థకు ఉండాల్సిన సాంకేతిక అర్హతలనూ జగన్ ప్రభుత్వం మార్చేసింది. కొన్నింటిని మినహాయించింది. 2012లో ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్లు పిలిచినప్పుడు.. 1.3 నిబంధన కింద గత పది సంవత్సరాల్లో కనీసం 35 మీటర్ల ఎత్తున ఒకటైనా స్పిల్‌వే, కాంక్రీట్ డ్యాం, మట్టి కట్ట, రాక్‌ఫిల్ డ్యాం, ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యాం నిర్మించిన అనుభవం ఉండాలన్నారు. 2019లో రివర్స్ టెండర్లు పిలిచినప్పుడు ఆ నిబంధన మినహాయించారు. 2012 టెండర్లలో 2.2 నిబంధన కింద ప్రధాన కాంట్రాక్టరుగా లేదా జాయింట్ వెంచర్‌లో... గత 10 ఆర్థిక సంవత్సరాల్లో రాతి, మట్టికట్ట డ్యాంలు, కాంక్రీటు డ్యాంలు లేదా బ్యారేజీలు, స్పిల్‌వేల పనిచేసి ఉండాలని నిబంధన పెట్టారు. 2019 రివర్స్ టెండర్లలో డ్యాంలు, స్పిల్‌వేల ప్రస్తావన లేకుండా మార్చివేశారు. అంటే పోలవరం వంటి ప్రధాన డ్యాం నిర్మించడానికి అనుభవం ఉండాల్సిన అవసరం లేదన్నట్లుగా.. సాంకేతిక అర్హతల్లో మార్పులు చేశారు. అందువల్లే మేఘా సంస్థకు అవకాశం దక్కిందన్న విమర్శలు వచ్చాయి.
మరో683 కోట్ల రూపాయల పనులు:పోలవరం ప్రధాన డ్యాంలో స్పిల్ ఛానల్ చివర్లో 13వందల 54 మీటర్ల పొడవున కటాఫ్ డయాఫ్రం వాల్ నిర్మించాలని 2021లో ప్రతిపాదించారు. ప్రధాన డ్యాం మూడో గ్యాప్‌లో 140 మీటర్ల పొడవున అనుకున్న మట్టి డ్యాంను కాంక్రీటు డ్యాంగా మార్చారు. స్పిల్ ఛానల్ కుడివైపున కొండవాలు రక్షణ పనులు ప్రతిపాదించారు. 683 కోట్లతో చేపట్టే ఈ పనులన్నింటినీ పాత ధరలతో నామినేషన్‌పై తొలుత మేఘాకు ఇచ్చేయాలని అధికారులు యత్నించారు. ఆ తర్వాత టెండర్లు పిలిచినా రెండు సంస్థలే పోటీ పడ్డాయి. అందులో ఒకటి మేఘా, మరొకటి H.E.S. ఈ పనులకు 0.9 శాతం తక్కువకు మేఘా బిడ్ వేసింది.
రివర్స్ టెండర్లలో I.B.M విలువపై 2 శాతం తక్కువకు చేసేందుకు అంగీకరించడంతో... వాళ్లకే పనులు దక్కాయి. పోలవరం ప్రధాన డ్యాంను ఆసరాగా చేసుకుని కొత్త ఎత్తిపోతలకు ప్రభుత్వం పాలనామోదం ఇచ్చింది. ప్రాజెక్టులో +35.51 మీటర్ల దిగువ నుంచి +32 మీటర్ల మధ్య ఉన్న నీటిని జనవరి, ఏప్రిల్ నెలల మధ్య ఎత్తిపోసి... వేసవిలో తాగునీటి అవసరాల కోసం ఉమ్మడి పశ్చిమ, కృష్ణా జిల్లాలకు మళ్లించాలని ప్రతిపాదించారు. దీన్ని ఆర్థికశాఖ ఉన్నతాధికారులు వ్యతిరేకించారు. పట్టిసీమ ఎత్తిపోతల ఉండగా 776 కోట్లతో కొత్తది అవసరం లేదని జలవనరుల నిపుణులూ అభిప్రాయపడ్డారు. అయినా ఎత్తిపోతలకు టెండర్లు పిలవడం, 765.94 కోట్లకు మేఘా సంస్థ దక్కించుకోవడం చకచకా జరిగిపోయాయి.
పోలవరం ప్రధాన డ్యాంలో తాజాగా 15వందల 99.21 కోట్ల పనులు కూడా మేఘాకు దక్కాయి. డయాఫ్రం వాల్ దెబ్బతినడం, భారీ వరదలకు ప్రధాన డ్యాం నిర్మించాల్సిన చోట అగాథాలు ఏర్పడటంతో... వాటిని సరిదిద్దే పనులకు 16వందల 15.75 కోట్లవుతుందని అంచనా వేశారు. రివర్స్ టెండరింగ్‌లో రెండు సంస్థలే పాల్గొనగా.. 15వందల 99.21 కోట్లకు మేఘా దక్కించుకుంది. పోలవరం డ్యాం మొత్తం 15వందల 48 కోట్లకే పూర్తి చేసేందుకు అప్పట్లో నిర్ణయించగా.. ఈ నాలుగేళ్లలో అదనపు పనులు, అవసరం లేని ఎత్తిపోతల నిర్మాణం లాంటివన్నీ కలిపి మేఘాకు అదనంగా సుమారు 3వేల కోట్ల పనులు ఇవ్వడం గమనార్హం.