Tadavai village graveyard occupied: ఆయనో రాజకీయ నాయకుడు. గతంలో సర్పంచ్‌గానూ పని చేశారు. ఊర చెరువు, దానికి ఆనుకుని ఉన్న శ్మశాన స్థలంపై అతడి కన్ను పడింది. కబ్జా చేసేందుకు గ్రామంలోని ఓ అమాయక రైతుని పావుగా వాడుకున్నారు. రాత్రికి రాత్రే సమాధులను తవ్వించేశారు. స్థలం నాది.. అందులోకి వస్తే అంతే అని.. గ్రామస్థులను హెచ్చరించారు. విషయం తెలిసి అవాక్కైన ఊరి ప్రజలు.. అధికారులను కలిసి మోసాన్ని వివరించినా పరిష్కారం లభించలేదు.
ఇది ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామానికి చెందిన ఊరచెరువు. ఈ చెరువులో కొంత భాగంతో పాటు పక్కనే ఉన్న స్థలాన్ని దశాబ్దాలుగా గ్రామానికి చెందిన వారు శ్మశానంగా వాడుకుంటున్నారు. గ్రామంలో ఎవరు కాలం చేసినా.. ఇక్కడే ఖననం చేస్తున్నారు. కరోనా సమయంలోనూ పెద్ద ఎత్తున ఇక్కడ సామూహిక ఖననాలు చేసినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. గతంలో ఓ సారి.. ఈ చెరువు పక్కనున్న శ్మశాన స్థలాన్ని పక్కనే ఉన్న రైతు ఆక్రమించాడు.
దీంతో గ్రామస్థులు అంతా ఏకమై.. అధికారుల చుట్టూ తిరిగి శ్మశాన స్థలాన్ని తిరిగి సాధించుకున్నారు. ఖననం చేసేందుకు వచ్చిన వారికి వీలుగా.. నాటి తెలుగుదేశం ప్రభుత్వంతో పాటు.. ప్రస్తుత వైసీపీ హయాంలోనూ నీటి వసతి కల్పిస్తూ నీళ్ల ట్యాంకులు కూడా నిర్మించారు. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉన్నా.. ఈ ఊరచెరువుతో పాటు పక్కనే ఉన్న శ్మశాన స్థలం కూడా తనదేనంటూ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ముందుకు వచ్చాడు. ఈ స్థలాన్ని తాను కొనుగోలు చేశానని.. ఇందులో ఎలాంటి ఖననాలు చేసేందుకు వీల్లేదంటూ గ్రామస్థులను అడ్డుకున్నాడు. చెరువులో ఉన్న సమాధులను సైతం తవ్వేసి.. కట్టమీద వేశాడు.