Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై దిల్లీలో నిర్వహించిన కీలక సమావేశంలోనూ నిధుల విడుదలపై ఎలాంటి స్పష్టత రాలేదు. గత నెలలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి 17వేల 144 కోట్లతో తొలిదశ అంచనా ప్రతిపాదనలు పంపినా.. ఇంకా ముందడుగు పడలేదు. కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆధ్వర్యంలో గురువారం దిల్లీలో జరిగిన సమావేశంలో ఈ అంశంపై చర్చించినా.. ప్రాజెక్ట్ అథారిటీ, కేంద్ర జలసంఘం ఆ ప్రతిపాదనలను పరిశీలించి కేంద్ర జలశక్తి శాఖకు పంపాలని మంత్రి ఆదేశించారు.
ఆ తర్వాత అది ఆర్థికశాఖ వద్దకు చేరాలి. గురువారం నాటి సమావేశంలో తొలిదశ నిధులకు ఆమోదముద్ర వేయవచ్చని ప్రభుత్వం తరఫున ప్రచారం సాగినా.. అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదు. పోలవరంలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 1800 కోట్లను ఇప్పించాల్సిందిగా అధికారులు కోరగా.. చర్యలు తీసుకుంటామని మాత్రమే కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. వీటిల్లో 550 కోట్లు కేంద్ర జలశక్తి శాఖ త్వరలోనే ఇవ్వనున్నట్లు తెలిసింది.
Polavaram Project: పోలవరం అంచనాలను భారీగా పెంచిన జగన్ సర్కార్.. వెల్లువెత్తుతున్న సందేహాలు
పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పటికే ఆలస్యం అయ్యాయని.. ఇకపై ఒక్కరోజు కూడా గడువు మీరకుండా చూడాలని.. కేంద్రమంత్రి అధికారులను హెచ్చరించారు. 2025 జూన్ నాటికి ప్రధాన డ్యాం నిర్మాణం పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే గడువుల్లో జూన్ అని చెబుతున్నా.. సంవత్సరాలు మారిపోతున్నాయని, 2021 నుంచి ఎప్పుడూ ఇదే కనిపిస్తోందని వెదిరె శ్రీరామ్ అన్నట్లు సమాచారం.
దీంతో కేంద్రమంత్రి షెకావత్ 2025 జూన్ వరకు గడువు పెంపు సరికాదని, 2024 జూన్ నాటికే పూర్తిచేయాలని ఆదేశించినట్లు తెలిసింది. వర్షాలుపడి వరదలు వచ్చేలోపు ప్రధాన డ్యాంలో కోతపడ్డ ప్రాంతంలో పనులు పూర్తిచేయాలన్నారు. ఎగువ కాఫర్ డ్యాంలో ఉన్న సీపేజీలను నిరోధించకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని, వరదల లోపు ఆ పని పూర్తిచేసుకుని ప్రధాన డ్యాం నిర్మాణంపై దృష్టి సారించాలని సూచించారు. ఈలోగా డయాఫ్రం వాల్ డిజైన్లకు ఆమోదం పొంది, పనులు ప్రారంభించాలని చెప్పారు. వీటిలో ఏ ఒక్కటి ఆలస్యం జరిగినా మరొక సీజన్ కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
Sujana Chowdary fire on YSRCP: 'జగన్ ప్రభుత్వ అసమర్థత వల్లే.. పోలవరం, రాజధాని నిర్మాణాలు పూర్తి కాలేదు'
పోలవరం ప్రాజెక్టు తొలిదశ అంచనాల్లో భూసేకరణ, పునరావాసానికి అదనంగా 5 వేల127 కోట్లు ప్రతిపాదించడంపై గురువారం నాటి సమావేశంలో చర్చించారు. లైడార్ సర్వే ప్రకారం 41.15 మీటర్ల స్థాయిలో నీరు ఉంటే.. మరో 36 గ్రామాలు, 48 ఆవాసాలు ఈ పరిధిలోకే వస్తాయని తెలిసిందని.. ఏపీ అధికారులు తెలిపారు. దీనివల్ల తొలిదశలోనే మరో 16వేల 642 కుటుంబాలను తరలించాలని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు సైతం ఇదే విధంగా చెప్పడంతో వెదిరె శ్రీరామ్ ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. లైడార్ సర్వే ఫలితాలను సమగ్రంగా అధ్యయనం చేశారా? అని ప్రశ్నించారు.
దీనికి పోలవరం అథారిటీ అధికారులు సరైన సమాధానం చెప్పలేకపోవడంతో.. పాలిగన్ మ్యాప్‌లు పరిశీలించారా అని కూడా అడిగారు. దానికీ వారినుంచి సమాధానం రాలేదు. పాలిగన్ మ్యాప్‌లు ఇంపోజ్ చేసి.. ఏ మేరకు ముంపు ఏర్పడుతుందో గమనించకుండానే ఇన్ని గ్రామాలు తొలిదశలోకి వస్తాయని ఎలా నివేదిస్తారని ఆయన ప్రశ్నించినట్లు తెలిసింది. లైడార్ సర్వేకు 8 నుంచి 9 నెలల సమయం ఎందుకు అని ఏపీ అధికారులను ప్రశ్నించారు. రెండు మూడు వారాల్లోనే ఈ సర్వే పూర్తి చేయవచ్చన్నట్లు సమాచారం.
Nagababu Released Video On Polavaram కథాకళి-2 పేరుతో ప్రత్యేక వీడియోను విడుదల చేసిన నాగబాబు
పోలవరం ప్రాజెక్టు తొలిదశ నిర్మాణానికి నిధులతోపాటు పునరావాసం, సవరించిన అంచనాలు, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో ముంపుపైనా చర్చించినట్లు ఏపీ అధికారులు తెలిపారు. మొత్తం ప్రాజెక్టు సవరించిన అంచనాలపై చర్చంచలేదని.. 41.15 మీటర్ల తొలిదశ నిర్మాణం కోసం ప్రతిపాదించిన 17 వేల 144 కోట్ల కోసమే చర్చించామన్నారు. రెండో సవరించిన అంచనాలలోని ఇతర విషయాలను పరిగణనలోకి తీసుకుంటారని చెప్పారు.
కేంద్రం నిధులు విడుదల చేస్తే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 45.72 మీటర్ల వరకూ నిర్మాణం పూర్తవుతుందని అన్నారు. సహాయ, పునరావాస కార్యక్రమాలు తొలిదశలో నీరు నిల్వచేసే 41.15 మీటర్ల వరకూ పూర్తవుతాయన్నారు. తొలిదశ నిర్మాణం ఎప్పటిలోగా పూర్తవుతుందో కసరత్తు చేసి కేంద్రానికి వెల్లడిస్తామన్నారు.
A key meeting on Polavaram : పోలవరంపై సమీక్ష... '2025 నాటికి పూర్తి చేయడమే లక్ష్యం' : ఈఎన్సీ