ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే: పోలవరం సాధికార సమితి - POLAVARAM PROJECT ROUNDTABLE MEETING

POLAVARAM PROJECT ROUNDTABLE MEETING UPDATES: పోలవరం ప్రాజెక్ట్.. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక జీవనరేఖ అని, భవిష్యత్తు అవసరాల కోసం కచ్చితంగా ప్రాజెక్ట్‌ను పూర్తి చేసే తీరాలని.. పోలవరం సాధికార సమితి గౌరవ అధ్యక్షులు, ప్రముఖ ఆర్థికరంగ నిపుణులు ప్రొఫెసర్‌ జి.వి.ఆర్‌.శాస్త్రి తెలిపారు. 'పోలవరం ప్రాజెక్టు-పూర్వాపరాలు' అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు.. ఏ రాజకీయ పార్టీకి సంబంధించినది కాదని.. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తి చేసేలా ప్రయత్నాలు చేస్తామన్నారు.

Polavaram project
Polavaram project

By

Published : Mar 15, 2023, 10:25 PM IST

POLAVARAM PROJECT ROUNDTABLE MEETING UPDATES: పోలవరం ప్రాజెక్ట్.. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక జీవనరేఖ అని, భవిష్యత్తు అవసరాల కోసం కచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసే తీరాలని.. పోలవరం సాధికార సమితి గౌరవ అధ్యక్షులు, ప్రముఖ ఆర్థికరంగ నిపుణులు ప్రొఫెసర్‌ జి.వి.ఆర్‌.శాస్త్రి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తయితే గనుక కొన్ని లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు. పోలవరం ప్రాజెక్టు.. ఏ రాజకీయ పార్టీకి సంబంధించినది కాదని.. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పోలవరం ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తి చేసేలా తన వంతు సహకారం అందిస్తానని ఆయన పేర్కొన్నారు.

పోలవరం ప్రాజెక్ట్‌పై రౌండ్ టేబుల్ సమావేశం:పోలవరం సాధికార సమితి ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్టు-పూర్వాపరాలు అనే అంశంపై ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్థిక రంగ నిపుణులు రైతు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాలొన్నారు. ఈ సందర్భంగా ఈ రౌండ్ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న.. ప్రొఫెసర్‌ జి.వి.ఆర్‌.శాస్త్రి మాట్లాడుతూ.. ''ఇప్పటికే రాష్ట్రానికి కృష్ణాజలాలు బాగా తగ్గిపోయాయి. ఏటేటా నీటి కొరత కారణంగా అన్ని జిల్లాల్లోనూ సాగు భూమి, పంటల ఉత్పత్తి తగ్గిపోతూ వస్తోంది. రాష్ట్రంలో 1997 నుంచి 2020 వరకూ అన్ని జిల్లాల్లోని పంటల సాగు లెక్కలను పరిశీలిస్తే.. ఆందోళనకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే.. ప్రకాశం, అనంతపూర్, కర్నూలు జిల్లాలు సస్యశ్యామలం అవుతాయి'' అని ఆయన అన్నారు.

అంతేకాకుండా, విజయనగరం, శ్రీకాకుళానికి పుష్కలంగా నీరు అందుతుందన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన అన్ని అంశాల గురించి ఢిల్లీలో వివరిస్తున్నానన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో గతంలొ కొన్ని పొరబాట్లు జరిగాయని.. మే మొదటి‌ వారంలో జరిగే సమావేశాల్లో పాల్గొని.. పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన అంశాన్ని కేంద్రానికి వివరిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంలో కేంద్రం కీలక బాధ్యత వహించాలన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేదన్నారు. పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. దాన్ని పూర్తి చేసే బాధ్యతను కూడా నేరవేర్చాలని డిమాండ్ చేశారు.

పోలవరాన్ని రాజకీయ అవసరాలకు వినియోగిస్తున్నారు: రాష్ట్రానికి ప్రాణంలాంటి పోలవరం విషయంలో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు చాలా బాధకరంగా ఉందని.. పోలవరం సాధికార సమితి కన్వీనర్ అక్కినేని భవానీ ప్రసాద్ అన్నారు. పోలవరం ప్రాజెక్టును రాజకీయ అవసరాలకు వినియోగించుకుంటున్నారని ఆవేదన చెందారు. రానున్న తరాలకు పోలవరం బంగారు గనిగా మారుతుందన్నారు. పొలవరం ప్రాజెక్టు వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించాలనే ఉద్దేశ్యంతోనే నేడు ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించామని పేర్కొన్నారు. ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇరువురు సమన్వయంతో.. పని చేస్తేనే ప్రాజెక్టు త్వరగా పూర్తవుతుందన్నారు.

నిర్వాసితుల సమస్యలు తీర్చి.. నిధులివ్వాలి:పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యత చాలా కీలకమైనదని.. ఏపీ రైతు సంఘం ఉపాద్యక్షులు కేశవరావు తెలిపారు. ప్రాజెక్టుపై గతంలో మంత్రులుగా చేసినవారు, ఇప్పుడు మంత్రి స్థానంలో ఉన్నవారు.. ఒక్కరిపై ఒక్కరు విమర్శలు చేసుకుంటున్నారే తప్ప పనులు మాత్రం చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పూర్తి అవడంతో పాటు నిర్వాసితుల సమస్య అత్యంత కీలకమన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులను విస్మరించడం సరికాదన్నారు. ముందు నిర్వాసితులకు న్యాయం చేసిన తర్వాతే.. ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లాలన్నారు. ప్రస్తుతం నిర్వాసితులకు ఇచ్చిన కాలనీలు మునిగిపోయాయని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ముందు నిర్వాసితుల సమస్యలు తీర్చాలని వేడుకున్నారు. 2013-14 బిల్లు ఇస్తామని కేంద్రం అంటే 2017-18 ప్రకారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుందన్నారు. ప్రాజెక్టు పూర్తి అయ్యేసరికి అప్పుడు ఉన్న అంచనాల ప్రకారం నిధులు ఇవ్వాలన్నారు.

పాలకులు ప్రకటనలతోనే సరి పెడుతున్నారు:పోలవరం ప్రాజెక్టు విషయంలో ‌పాలకులు అనుకులంగా మాట్లాడతారు కానీ.. పనులు మాత్రం చేయకుండా ప్రకటనలతో సరి పెడుతున్నారని.. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరావు అన్నారు. ఎప్పటికప్పుడు నిర్మాణ వ్యయ అంచానాలు పెరిగి పోతున్నాయని, నిర్వాసితులకు నష్ట పరిహారం, ఆర్ అండ్ ఆర్ అమలు‌ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆనాడు కేంద్రం అంగీకరించిన విధంగా 150 అడుగుల ఎత్తును కొనసాగించాలన్నారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే అది ఒక బ్యారేజ్‌గా మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తే ఏపీ ప్రజలకు, రైతాంగానికి ద్రోహం చేసినట్లేనన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణలో‌ కూడా కేంద్రం వెనక్కి తగ్గలేదన్నారు. తాజాగా ప్రైవేటీకరణపై మంత్రి ప్రకటన చేశారని, ఏపీ ప్రజలను బీజేపీ మోసం చేయడం సమంజసం‌ కాదన్నారు. గతంలొ చేసుకున్న ఒప్పందాలను అమలు‌ చేయాలని కోరుతున్నామన్నారు.

పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే:కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని ఎప్పుడో ప్రకటించిందని.. విశ్రాంత జలవనరుల శాఖ అధికారులు పాపారావు, మారుతి ప్రసాద్ తెలిపారు. నిబంధనల ప్రకారం.. కేంద్రం పూర్తి బాధ్యత తీసుకుని ప్రాజెక్టును అనుకున్న సమయంలోగా పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే చాలా కాలయాపన జరిగిందని, 2032లోపు ఈ ప్రాజెక్టు పూర్తవ్వకపోతే, రాష్ట్ర పరిస్థితి అత్యంత దారుణంగా మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అనేక జిల్లాలు వ్యవసాయానికి దూరమైపోతాయని, ఈ జాతీయ ప్రాజెక్టుపై సరైన అవగాహన లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటూ.. నిర్మాణ వ్యయాన్ని పెంచుతున్నారన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ వ్యవసాయం నిలబడాలంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అత్యంత ఆవశ్యకమన్నారు.

పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే..అన్ని కాలాల్లో పంటలు పండించవచ్చు: పోలవరం ప్రాజెక్టు పూర్తయితే గనుక.. ఆంధ్రప్రదేశ్‌లోని 13 ఉమ్మడి జిల్లాల్లో.. అన్ని కాలాల్లోనూ మూడు పంటలను పండించేందుకు పుష్కలంగా నీటిని అందించొచ్చని సాగు నీటిపారుదల రంగ నిపుణులు తెలిపారు. పోలవరం పూర్తి చేయడంపై ప్రస్తుత ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని వారు సూచిస్తున్నారు. ఒకసారి డిజైన్‌ ఆమోదించిన తర్వాత దాని ప్రకారమే ప్రాజెక్టును ఎలాంటి మార్పులు చేయకుండా పూర్తి చేయాలని వారు తెలిపారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details