Illegal Excavations in Kolleru: జీవవైవిధ్యానికి ఆవాసమైన ఏలూరు జిల్లా కొల్లేరు అభయారణ్యంలో అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఐదో కాంటూరు పరిధిలో తవ్వకాలు, భారీ యంత్రాల వినియోగం, ఆక్వా సాగు నిషిద్ధమైనా.. క్షేత్రస్థాయిలో మాత్రం అవేమీ అమలు కావడంలేదు. వందల ఎకరాల్లో ఇష్టారాజ్యంగా చెరువులు తవ్వేస్తున్నారు. అక్రమార్కుల ధనదాహానికి కొల్లేరు సహజ రూపును కోల్పోతుంది. ఇప్పటికే అనధికారికంగా వందల ఎకరాల్లో చేపలు, రొయ్యలు సాగు చేస్తుండగా.. అధికారుల అలసత్వం, పట్టించుకోనితనం కారణంగా ఇది కాస్తా వేల ఎకరాలకు విస్తరిస్తూ సరస్సు మనుగడకే ప్రశ్నార్థకంగా మారుతోంది. పూడిక తీత, చెరువుల మరమ్మతుల ముసుగులో ఏటా ఎండాకాలంలో కొల్లేరులో కొత్తగా అక్రమ చెరువులు పుట్టుకొస్తున్నాయి. కొందరు ఏప్రిల్ ఆరంభం నుంచి చెరువులు తవ్వుతుండగా.. మరికొందరు ఈ ఏడాది జనవరిలోనే చెరువులు తవ్వేశారు.
కైకలూరు పరిధిలోని పందిరిపల్లెగూడెం, చటాకాయ గ్రామాల్లో అక్రమ తవ్వకాలు బహిరంగ రహస్యం. పందిరిపల్లెగూడెంలోనే 15 ప్రొక్లెయిన్లు, ట్రాక్టర్లతో బుధవారం రాత్రి నుంచి దాదాపు వంద ఎకరాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడకు రెండు కిలోమీటర్ల దూరంలోనే పెంచికలమర్రు అటవీ చెక్‌పోస్టు ఉంది. ఈ చెక్‌పోస్టు దాటే.. ఈ వాహనాలు, యంత్రాలన్నీ కొల్లేరులోకి అడుగుపెట్టాయి. చటకాయలోనూ.. 60 ఎకరాల్లో 3 చెరువులు తవ్వుతున్నారు. ఆకివీడు మండలం.. చినమిల్లిపాడులో 70, సిద్దాపురంలో 200 ఎకరాల్లో చెరువులు తవ్వకాలు పూర్తికావచ్చాయి.