జాతీయ రహదారి 165లో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ వద్ద బుధవారం అర్ధరాత్రి కొద్దిలో పెనుప్రమాదం తప్పింది. నిర్మాణ దశలో ఉన్న సిమెంట్ (స్పెయిన్) గడ్డర్లు నాలుగు కుప్పకూలాయి. ఈ సంఘటన జరిగిన వెంటనే చుట్టూ పరదాలు కట్టేయడంతో పాటు రాకపోకలు సాగుతున్న రహదారికి ఇది దూరంగా ఉండటంతో గురువారం మధ్యాహ్నం వరకు ఈ విషయం ఎవరికీ తెలియలేదు. పామర్రు- దిగమర్రు జాతీయ రహదారి (నాలుగు వరుసలు) విస్తరణలో భాగంగా ఏలూరు జిల్లా కైకలూరు మండలం ఆలపాడు పంచాయతీ పరిధిలోని సోమేశ్వరం వద్ద రూ. 66 కోట్ల వ్యయంతో 1.6 కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం పిల్లర్లపై నాలుగు నిలువు వరుసల్లో సిమెంటు గడ్డర్లను ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి అవి ఒక్కసారిగా కుప్పకూలాయి. ఆ సమయంలో జన సంచారం లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతం చుట్టూ పరదాలను కట్టించారు. ఫ్లైఓవర్ నిర్మాణ దశలోనే సిమెంటు గడ్డర్లు కూలిపోవడం చర్చనీయాంశంగా మారింది. సాంకేతిక లోపమా? నాణ్యత ప్రమాణాలు లోపించాయా అనేది తేలాల్సి ఉంది.
తప్పిన పెను ప్రమాదం..నిర్మాణంలోనే కుప్పకూలిన ఫ్లైఓవర్ గడ్డర్లు - నిర్మాణంలోనే కుప్పకూలిన ఫ్లైఓవర్ గడ్డర్లు
ఏలూరు జిల్లా కైకలూరు మండలం ఆలపాడు పంచాయతీ పరిధిలోని సోమేశ్వరం వద్ద బుధవారం అర్ధరాత్రి కొద్దిలో పెనుప్రమాదం తప్పింది. నిర్మాణ దశలో ఉన్న సిమెంట్ గడ్డర్లు నాలుగు కుప్పకూలాయి. ఆ సమయంలో జన సంచారం లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
Flyover girders collapse