Farmers fire on ap government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం రైతులకు పంపిణీ చేసే గోనె సంచుల విషయంలో నాణ్యమైన సంచులను ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఎకరానికి 110 గోనె సంచులు అవసరం కాగా, ప్రభుత్వం మాత్రం 91 సంచులనే పంపిణీ చేసిందని.. పంపిణీ చేసిన ఆ 91 గోనె సంచుల్లో దాదాపు 40 శాతానికిపైగా చినిగిపోయి ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి.. ఎకరానికి 110 గోనె సంచులను పంపిణీ చేయాలని కోరుతున్నారు.
ఎకరానికి 110 సంచులు ఇవ్వాలి.. ఖరీఫ్ మాదిరే రబీలో కూడా ధాన్యం కొనుగోళ్ల విషయంలో తలెత్తుతున్న సమస్యల కారణంగా అన్నదాతలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎకరానికి 110 గోనె సంచులు వరకు అవసరం కాగా, రాష్ట్రం ప్రభుత్వం 91 సంచులను మాత్రమే రైతులకు పంపిణీ చేస్తుంది. దీంతో ఖరీఫ్‌లో కన్నా రవి దిగుబడి ఎక్కువగా ఉంటుందని.. తక్కువ సంచులిస్తే ఎలా అని రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
91 సంచుల్లో చాలావరకు చిరిగిపోయాయి.. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురంలోని రైతులను ఈ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ప్రభుత్వం ఎకరానికి ఇచ్చే 91 గోనె సంచుల్లో చాలా వరకు చిరిగిపోయి ఉన్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆ 91 సంచుల్లో కూడా చాలా వరకు చిరిగిపోయి ఉండడంతో.. కొంత ధాన్యం కల్లాల్లోనే ఉండిపోతుందని అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా మిగిలిపోయిన ధాన్యానికి సంచులు ఎప్పుడు ఇస్తారో.. పట్టుబడి ఎలా జరుగుతుందో.. అని అని రైతులు భయానికి గురవుతున్నారు.