Farmer Distributed Four Tons Of Mangoes For Free In Agiripalli: ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు సరైన మద్దతు ధర రాకపోతే రైతు పడే వేదన ఎలాంటిదో తెలియజేసే ఘటన ఏలూరు జిల్లా నూజివీడులో జరిగింది. గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో ఓ రైతు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తూ ప్రజలకు ఉచితంగా మామిడికాయలు పంపిణీ చేశారు. ప్రభుత్వానికి ఇప్పటికైనా కనువిప్పు కావాలన్నారు.
రైతుల కష్టాన్ని దోచుకుంటున్న దళారులు : ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామానికి చెందిన బెక్కం రాజగోపాలరావు అనే రైతు ఎకరానికి 50 వేల నుంచి 60 వేల వరకు పెట్టుబడి పెట్టి నాలుగు ఎకరాల్లో మామిడి సాగు చేశారు. పంట కోసి శనివారం నాలుగు టన్నుల బంగినపల్లి మామిడిని ఈదర మార్కెట్‌కు తరలించారు. వ్యాపారులు టన్నుకు 6 వేలు ధర నిర్ణయించడంతో అక్కడ విక్రయించకుండా వెనక్కు తీసుకు వచ్చారు. తన తోటలో పండించిన మామిడి కాయలకు కనీసం కోత కూలి కూడా రాకపోవడంతో విసుగు చెందారు.
కష్టపడి పండించిన పంటను దళారుల పాలు చేయడానికి ఇష్టం లేక కనీసం ప్రజలకు వితరణగా అందిస్తే పుణ్యమైనా వస్తుందని భావించారు. ఆదివారం సామాజిక కార్యకర్త అయ్యంకి సురేష్ బాబుతో కలసి ఓ ట్రాక్టరుపై ఆ మామిడిని తీసుకొచ్చి నూజివీడులో ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సంఘటన రైతుల దైనస్థితికి అడ్డం పడుతోంది. గతంలో టన్ను 30 వేల నుంచి 40 వేల రూపాయల వరకు ఉండే ధరను వ్యాపారులు 4 వేల నుంచి 12 వేల రూపాయల వరకు నిర్ణయిస్తున్నారు. దళారులు కుమ్మక్కై రైతులను నిలువునా ముంచుతున్నారని రైతు రాజగోపాల రావు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఉద్యాన శాఖ అధికారుల ద్వారా పంటను మూడు గ్రేడులుగా విభజించి ధరను ప్రకటించేలా చర్యలు తీసుకోవాలి అని మామిడి రైతులు కోరుతున్నారు.