చాలినంత సమయం ఉన్నా ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల నిర్మాణం పూర్తి చేయకపోవడం వల్లే పోలవరం ప్రాజెక్టులో ఇంత తీవ్ర సమస్య ఏర్పడిందా? కొత్త ప్రభుత్వం ఏర్పడేనాటికి ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలలో కలిపి 60 లక్షల క్యూబిక్ మీటర్ల పని మాత్రమే మిగిలింది. అదీ మట్టి పని. వరదల కాలం, కరోనా నెల తీసేసినా ఈ పని చేయడానికి చాలినంత సమయం ఉంది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా భవిష్యత్తు ఇబ్బందులను అంచనా వేయకుండా వ్యవహరించడం వల్లే 2020 వరదల్లో విధ్వంసం జరిగిందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశంలో జరిగిన చర్చలు, డ్యాం డిజైన్ రివ్యూ కమిటీ సమావేశాల మినిట్స్ ఆధారంగా పరిశీలిస్తే పనులు అర్ధాంతరంగా నిలిపివేయడం, అత్యవసర పనులు కూడా... ఉన్న సమయంలో పూర్తి చేయకపోవడమే పెను సమస్యలకు దారి తీసిందన్న వాదనకు బలం చేకూరుతోందని విశ్రాంత ఇంజినీరింగు అధికారులు, నిపుణులు పేర్కొంటున్నారు. పోలవరం ప్రాజెక్టులో కొత్త టెండర్లు పిలవొద్దని, అలా చేస్తే ప్రాజెక్టు భవితవ్యమే అనిశ్చితిలో పడుతుందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ 2019 ఆగస్టులోనే హెచ్చరించినా వారి సందేహాలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వకుండా ముందుకు వెళ్లిందనే విమర్శలు వస్తున్నాయి.
2018 నవంబరులో ఎగువ కాఫర్ డ్యాం పనులు ప్రారంభించారు. మే నెల వరకు అంటే ఏడు నెలల్లో 38.12 లక్షల క్యూబిక్ మీటర్ల పని పూర్తిచేశారు. దిగువ కాఫర్ డ్యాంలో అంత కన్నా ఆలస్యంగా పనులు ప్రారంభించారు. 3.37 లక్షల క్యూబిక్ మీటర్లు పూర్తిచేశారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలలో ఇక చేయాల్సింది కేవలం మట్టి పని మాత్రమే. ఆ పనులు పూర్తి చేసేందుకు 2020 వరదల కాలం వరకు చాలా సమయం ఉన్నా పూర్తిచేయలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలవరం ప్రాజెక్టు అథారిటీ 2020 మే నాటికి కాఫర్ డ్యాంలు పూర్తిచేయాలని చెప్పింది. 2020 వరదల్లో గోదావరి నదీగర్భం కోసుకుపోయింది. డయాఫ్రం వాల్ దెబ్బతింది. ఇప్పుడు ఈ సమస్యలను ఎలా పరిష్కరించాలా అన్న సవాలు ఎదురయింది. రూ.వందల కోట్ల అదనపు భారం పడబోతోంది. పోలవరంలో అనవసర కాలయాపన చేయకుండా పనులు చేసి ఉంటే ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల నిర్మాణం పూర్తిచేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్న వాదన నిపుణుల నుంచి వినిపిస్తోంది.
పనులు ఆపేయడమే అసలు సమస్య కాదా?
పోలవరం ప్రాజెక్టులో స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాం నిర్మాణాలు సమాంతరంగా చేయాలని పాత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని పని చేసుకుంటూ వెళ్లింది. స్పిల్ వే, కాఫర్ డ్యాంల నిర్మాణాలు సమాంతరంగా చేసేందుకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ, డ్యాం డిజైన్ రివ్యూ కమిటీలూ ఆమోదించాయి. పోలవరంలో ఏ పని చేయాలన్నా వారి ఆమోదం తప్పనిసరి. 2019 జూన్ నాటికే ఎగువ దిగువ కాఫర్ డ్యాంల నిర్మాణం పూర్తిచేయాలనేది లక్ష్యం. 2019 ఏప్రిల్‌లో ఎన్నికలు రావడంతో పోలవరం పనులు మందగించాయి.
*2019 మేలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. పోలవరం పనులను నిలిపివేసింది. కొత్తగా రివర్స్ టెండర్లు పిలుస్తామని ప్రకటించింది. 2019 అక్టోబరులో టెండర్ల కార్యక్రమం నిర్వహించింది.
పోలవరం అథారిటీ అడ్డు చెప్పలేదా?
పోలవరం పనులు ఆపేయడం తగదని పోలవరం ప్రాజెక్టు అథారిటీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. కొత్తగా టెండర్లు పిలిస్తే చాలా సమస్యలు ఎదురవుతాయంది. పోలవరం పనుల్లో తగిన పురోగతి ఉన్నందున గుత్తేదారుణ్ని మార్చవలసిన అవసరం లేదంది. ప్రస్తుత వర్షాకాలంలో డిజైన్లు ఖరారు చేసుకుంటే ఆ తర్వాత పనులు త్వరగా పూర్తిచేయొచ్చని సూచించింది. కొన్ని అంశాలు లేవనెత్తుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని సమాధానం కోరింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయం పట్టించుకోకుండా పనులు నిలిపివేసి రివర్స్ టెండర్లు నిర్వహించింది. 2019 నవంబరులో కొత్త ఏజెన్సీకి పనులు అప్పగించింది. తర్వాత కూడా పనులు వేగంగా సాగలేదు. నవంబరు నుంచి ఏప్రిల్ వరకు (కరోనా ఉద్ధృతి పెరిగే వరకు) ఆరు నెలల సమయం ఉన్నా ఎగువ కాఫర్ డ్యాంలో గ్యాప్‌ల్లో మిగిలి ఉన్న పని, దిగువ కాఫర్ డ్యాం పని చేసి ఉంటే ఈ విధ్వంసం వాటిల్లే అవకాశం లేని మాట వాస్తవం కాదా అన్నది చర్చనీయాంశమవుతోంది.
35.82 లక్షల క్యూ.మీ. పని చేయలేరా?