అంగన్వాడీలనూ మోసం చేసిన జగన్ CM Jagan Neglecting Anganwadi Workers: సాయం చేయడం అంటే కుడిచేతితో ఇస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదంటారు.! కానీ జగనన్న మార్క్ సాయమే వేరు.! కుడిచేతితో ఇచ్చి ఎడమ చేతితో లాగేసుకుంటారు.! అంగన్వాడీలకూ అదే తరహా మోసం చేశారు. తెలంగాణ కన్నా ఎక్కువ గౌరవ వేతనం ఇస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన జగన్.. మాట తప్పి మడమ తిప్పేశారు. కేవలం వెయ్యిరూపాయలు పెంచి సంక్షేమ పథకాలు కత్తిరించేశారు.
''అంగన్వాడీలకు సంబంధించిన అక్కచెల్లెమ్మలకు నాలుగు నెలలుగా జీతాలు లేవు. వీరు చిన్న పిల్లలకు మధ్యాహ్న భోజనం వండి పెట్టాలి. ఆ భోజనం బిల్లులు ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి. బిల్లులు కూడా పెండింగ్‌లో పెట్టి.. చివరకు వారి గౌరవ వేతనం కూడా పెండింగ్‌లో పెడితే వీళ్లు ఏం బతుకుతారు.. చిన్నపిల్లలకు భోజనం ఏం పెడతారని నేను చంద్రబాబును ప్రశ్నిస్తున్నా'' అని నాడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్న మాటలివి.
నాటి సీఎం చంద్రబాబుకు జగన్ సంధించిన ప్రశ్నలనే.. నేడు అంగన్వాడీ అక్కచెల్లెమ్మలు సీఎం హోదాలో ఉన్న జగన్‌ను అడుగుతున్నారు. అంగన్వాడీల మెనూ ఛార్జీలు ఠంచనుగా చెల్లించడం లేదు. ప్రస్తుతం ఏప్రిల్, మే, జూన్ నెలల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. బకాయిలు విడుదల చేసే వరకూ ఈ ఖర్చునూ అంగన్‌వాడీలు చేతి నుంచే పెట్టుకోవాల్సి వస్తోంది.
"ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఘనంగా చెప్పుకుంటున్నారు. మేము ఇంతా మెనూ పెడుతున్నాము. ఇంతా చేస్తున్నాము అని.. ఆకుకూర పప్పు పెడుతున్నాము, గుడ్డు, పాలు అందిస్తున్నామని చెప్తున్నారు. కానీ, అవి మా సొంత డబ్బులతో, పుస్తెలు, నగలు తాకట్టు పెట్టుకుని నడపాల్సిన పరిస్థితి." -అంగన్వాడీ కార్యకర్త
అంగన్వాడీలకు ఇచ్చిన అన్నిహామీలపై జగన్ మాటతప్పి, మడమతిప్పారు. అధికారంలోకి వస్తే తెలంగాణ కంటే అధికంగా వేతనాలు పెంచుతామని.. ఎన్నికల ముందు అంగన్‌వాడీలకు జగన్ హామీఇచ్చారు. గత ప్రభుత్వం దిగిపోయేనాటికి 10వేల 500 రూపాయలుగా ఉన్న అంగన్వాడీల వేతనాన్ని.. జగన్ అధికారంలోకి వచ్చాక జూన్ 2019లో మరో వెయ్యిరూపాయలు పెంచి.. పదకొండున్నర వేలు చేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వం 2021 జులైలో అంగన్‌వాడీల గౌరవ వేతనాన్ని 13 వేల 650కి మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకిచ్చే వేతనాన్ని రూ.7,800కు పెంచింది. మరి మాసంగతేంటి? పాదయాత్రలో ఇచ్చిన హామీ గతేంటని..? అంగన్వాడీలు నిలదీస్తున్నారు.
"మాట తప్పను, మడమ తిప్పును అని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటప్పుడు.. నుదుటి మీద ముద్దుపెట్టాడు, తలమీద చేయి పెట్టాడు. తలమీద చేయి మిగిలింది తప్పా.. మాకు ఒరిగిందేమి లేదు. పెంచుతామన్న హామీల గురించి ప్రశ్నిస్తే.. తక్కువగా ఇస్తున్న రాష్ట్రాలను చూపించి వీరికన్నా మీకు ఎక్కువగానే ఇస్తున్నామని శిశు సంక్షేమ శాఖ మంత్రి అంటున్నారు." -అంగన్వాడీ కార్యకర్త
వెయ్యిరూపాయలు పెంచారని పాలాభిషేకాలు చేసిన అంగన్వాడీల సంతోషంపై జగన్ అంతలోనే నీళ్లు చల్లారు. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కునే జగన్ మార్క్ మోసాన్ని వాళ్లపైనా ప్రయోగించారు. సంక్షేమ పథకాలకు ఎసరు పెట్టారు. పథకాలను తీసేస్తున్నామని నేరుగా చెప్పకుండా 10వేల రూపాయల ఆదాయ పరిమితి నిబంధనకి లోబడి ఉన్నవారికే పథకాలు అమలు చేయాలని.. గతేడాది ఏప్రిల్ 19న ఉత్తర్వులిచ్చారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లోని అంగన్‌వాడీ కార్యకర్తలు అమ్మఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్, సామాజిక భద్రత కింద ఇచ్చే ఒంటరి, వితంతు, దివ్యాంగ పింఛన్లు, ఇళ్ల స్థలాలు ఇతర ప్రభుత్వ పథకాలు కోల్పోయారు.
పదవీ విరమణ చేసిన అంగన్వాడీలకు గత ప్రభుత్వంలో.. పదవీ విరమణ అనంతరం 50 వేల రూపాయలు ఇచ్చేవారు. ఇప్పటికే పదవీవిరమణ చేసిన చాలామందికి 50 వేలు ఇవ్వలేదని వాపోతున్నారు. నిర్వహణ భారం పెరిగినా గౌరవవేతనం పెంచడం లేదని మండిపడుతున్నారు. వంట గ్యాస్ సిలిండర్ మార్కెట్‌లో 1150 రూపాయలుంటే.. ప్రభుత్వం 600రూపాయలు మాత్రమే చెల్లిస్తోందని.. మిగతా 550 రూపాయలు ఎక్కడ నుంచి తేవాలని ప్రశ్నిస్తున్నారు.