Idhem Karma Mana Rastraniki program in Eluru district:వైసీపీ పాలనలో లోపాలు ఎత్తిచూపి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని చంద్రబాబు నేడు ఏలూరు జిల్లాలో ప్రారంభించనున్నారు. 50 రోజుల్లో 50 లక్షల కుటుంబాలు... 2కోట్ల మంది ప్రజలను కలిసి వారి కష్టాలను తెలుసుకునేలా కార్యక్రమాన్ని రూపొందించారు. చంద్రబాబు పర్యటన దృష్ట్యా అసాంఘిక శక్తుల నుంచి ముప్పు ఉందని.. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని తెలుగుదేశం నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు.
25 నియోజకవర్గాల్లో: జనం కష్టాలు వారి నోటి నుంచి వినడమేగాక.. వారికి భరోసా కల్పించేలా ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టింది. నేడు ఏలూరు జిల్లా విజయరాయి గ్రామంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం చింతలపూడి, పోలవరం, కొవ్వూరు, నిడదవోలు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో 3రోజుల పాటు చంద్రబాబు పర్యటించనున్నారు. 50రోజుల కార్యక్రమంలో స్వయంగా చంద్రబాబు 25నియోజకవర్గాల్లో తిరగనుండగా... రాష్ట్రవ్యాప్తంగా 2కోట్ల మందిని కలిసి వారి సమస్యలు తెలుసుకునేందుకు 8వేల బృందాలు పనిచేయనున్నాయి. పార్టీ శ్రేణులు ప్రతి గ్రామంలో వీలైనన్ని కుటుంబాల వద్దకు వెళ్లి వారి సమస్యలు, కష్టాలను తెలుసుకొని అండగా ఉంటామని భరోసా ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగం, మహిళలపై పెరిగిన అఘాయిత్యాలు, అత్యాచారాలు, క్షీణించిన శాంతిభద్రతలు ధరల పెరుగుదల, మద్యం, మత్తు పదార్థాల వాడకం, అన్నదాతల సమస్యలపై వివరాలు సేకరించనున్నారు.
ప్రతి కిట్లో వివిధ ప్రశ్నలతో రూపొందించిన పత్రం:వైసీపీ ప్రభుత్వంలోని ఇబ్బందులు, సమస్యలపై తెలుగుదేశం బృందాలు ప్రజాభిప్రాయం సేకరించనున్నాయి. ఇందుకోసం ఇంటింటికీ వెళ్లి ప్రత్యేకంగా సిద్ధం చేసిన కిట్లను పంపిణీ చేస్తారు. ప్రతి కిట్లో వివిధ ప్రశ్నలతో రూపొందించిన పత్రం, ఒక క్యాలెండర్ ఉంటాయి. ప్రతి కుటుంబంతో పత్రాన్ని నింపించి, దాన్ని ఫొటో తీసి వాట్సాప్ ద్వారా కేంద్ర కార్యాలయానికి పంపనున్నారు. అన్నింటినీ క్రోడీకరించి ఒక నివేదిక సిద్ధం చేయనున్నారు. దీన్ని రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్, సీఎంలలో ఎవరికైనా ఒకరికి పంపించనున్నారు. రాష్ట్రంలోని ప్రజల ఈ దుస్థితికి ప్రభుత్వ అసమర్థ అవినీతి అరాచక పాలనే కారణమని ప్రజలు గుర్తించేలా చేస్తామని తెలుగుదేశం నేతలు తెలిపారు.