ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వారిని ప్రభుత్వం ఆదుకోవాలి.. అకాల వర్షాలపై సీఎస్‌కు చంద్రబాబు లేఖ - Chandrababu letter to the Chief Secretary of Govt

TDP chief Chandrababu letter to the Chief Secretary of AP Govt: రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలకు సంబంధించి.. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి రెండు పేజీల లేఖను రాశారు. ఆ లేఖలో అకాల వర్షాల కారణంగా పలు జిల్లాలో పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయిన రైతుల వివరాలను, వర్షాల కారణంగా కల్లాల్లో తడిసిన ధాన్యానికి సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు.

Chandrababu
Chandrababu

By

Published : Mar 22, 2023, 9:03 PM IST

TDP chief Chandrababu letter to the Chief Secretary: రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్ రెడ్డికి ఈరోజు రెండు పేజీల లేఖను రాశారు. ఆ లేఖలో అకాల వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, అకాల వర్షాల కారణంగా పలు జిల్లాలో పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయిన రైతుల వివరాలను వెల్లడించారు. దానితోపాటు వర్షాల కారణంగా కల్లాల్లో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే స్పందించి కనీస మద్దతు ధరను కేటాయించి కొనుగోలు చేయాలని ఆయన పేర్కొన్నారు.

లేఖలో పేర్కొన్న అంశాలు: ''రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. భారీ వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. కొన్ని చోట్ల ప్రాణనష్టం కూడా జరిగింది. తాజాగా పలు జిల్లాల్లో వాణిజ్య పంటలతో పాటు ఉద్యానవన పంటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతోపాటు పశువులు కూడా చనిపోయాయి. జంగారెడ్డిగూడెంలోని తాడువాయి గ్రామానికి చెందిన మెట్ల సంధ్య, కలిగిరి మండలం అనంతపురం గ్రామానికి చెందిన శ్రీవిద్య (38) భారీ వర్షాల కారణంగా పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. మరోపక్క అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా మిర్చి పంట, మినుముల పంట, జొన్న పంట, అరటి తోటలు, బొప్పాయి పంట, మామిడి తోటలు, టమాట తోటలు, వరి పంటతోపాటు తదితర పంటలు భారీగా దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయి..అప్పుల పాలయ్యారు.

ఇక, వరి ధాన్యం కొనుగోళ్ల విషయానికొస్తే.. శ్రీకాకుళం జిల్లాలో, నెల్లూరు జిల్లాలో పండించిన వరి ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం జాప్యం వల్ల ఆ జిల్లాల రైతులు భారీగా నష్టపోయారు. పల్నాడు, ప్రకాశం, ఎన్టీఆర్, కర్నూలు, ఏలూరు, అనంతపురం, అల్లూరి సీతారామరాజు, కడప జిల్లాల్లో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అకాల వర్షాల వల్ల తీవ్ర నష్టం ఉన్నా వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే అభిప్రాయం ఉంది.'' అని చంద్రబాబు నాయుడు లేఖలో పేర్కొన్నారు.

ప్రభుత్వం తక్షణమే స్పందించాలి:ఇప్పటికే రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను, చేతికొచ్చిన పంటలు వర్షం కారణంగా దెబ్బతిన్న రైతులను.. ప్రభుత్వం తక్షణమే స్పందించి.. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చంద్రబాబు నాయుడు సూచించారు. పంట నష్టపరిహారంతో పాటు వర్షాల కారణంగా మరణించిన బాధితుల కుటుంబ సభ్యులకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. హార్టికల్చర్, వాణిజ్య పంటల నష్టాన్ని తక్షణమే అంచనా వేయాలని కోరారు. వర్షపు నీటిలో తడిసిన వరి ధాన్యాన్ని కనీస మద్దతు ధర చెల్లించి తక్షణమే కొనుగోలు చేయాలని సూచించారు. పంట రుణాల తక్షణ పునరుద్ధరణ చేపట్టాలని బాధిత రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలని కోరారు. వడగండ్ల వాన కారణంగా దెబ్బతిన్న ఆస్తికి పరిహారం చెల్లించాలని అన్నారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details