పోలవరం గైడ్‌బండ్ ఎందుకు కుంగింది..?వాడీవేడీ చర్చ.. Meeting on Polavaram Guidebund Sagging: కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన పోలవరంపై సోమవారం దిల్లీలో సమావేశం జరిగింది. కేంద్రమంత్రి ప్రధాన సలహాదారు వెదిరె శ్రీరామ్, జలసంఘం ఛైర్మన్, నిజనిర్ధారణ కమిటీ ఛైర్మన్ పాండ్యా, కమిటీ సభ్యులు, ఏపీ జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి, పీపీఏ సీఈవో సహా ప్రాజెక్టుకు సంబంధించిన కీలక భాగస్వాముల ప్రతినిధులు హాజరయ్యారు. ఏపీ జలవనరుల శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్, కేంద్ర జలసంఘం, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చి స్టేషన్, వ్యాప్కోస్ లాంటి విభాగాలకు పోలవరంలో భాగస్వామ్యం ఉండగా.. గైడ్‌బండ్ కుంగడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని కేంద్రమంత్రి షెకావత్ ప్రశ్నించారు.
Polavarm Guidebund: బాధ్యులు ఎవరో తేల్చండి.. పోలవరం గైడ్‌బండ్ కుంగడంపై కేంద్ర జల్‌శక్తి శాఖ సీరియస్
దీనికి బాధ్యులెవరో స్పష్టంగా తేల్చాలని అన్నారు. కీలక భాగస్వాములను ప్రశ్నించినప్పుడు ఒకరిపై ఒకరు బాధ్యత నెట్టుకోవడంతో కేంద్రమంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇన్ని సంస్థల మధ్య ఎందుకు సమన్వయం లేదని నిలదీశారు. గైడ్‌బండ్ కుంగడానికి బాధ్యులను తేల్చడంతో పాటు.. ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలను అధ్యయనం చేసి, వాటిని సరిదిద్దేందుకు వెదిరె శ్రీరామ్ నేతృత్వంలో కమిటీని నియమించారు. కేంద్ర జలసంఘం ఛైర్మన్‌తో పాటు మరికొందరు ఈ కమిటీలో ఉంటారు. వచ్చే ఆదివారం దిల్లీలో సమావేశం ఏర్పాటుచేసిన ఈ కమిటీ.. పోలవరంలో కీలక భాగస్వామ్య సంస్థలు, రాష్ట్ర జలవనరులశాఖ, ముఖ్య అధికారులు, మేఘా, బావర్ సంస్థలతో పాటు పనులు చేస్తున్న ఇతర గుత్తేదారు సంస్థల ప్రతినిధులు పిలిచింది. అందరూ నేరుగా రావాల్సిందేనని, వీడియో కాన్ఫరెన్సులో పాల్గొనడానికి వీల్లేదని స్పష్టంచేసింది. గైడ్‌బండ్ కుంగడానికి బాధ్యులను తేల్చడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి లోపాలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రమంత్రికి ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది.
Polavaram victims: "తాడో పేడో తేల్చుకుంటాం".. పోలవరం బాధితుల మహా పాదయాత్ర
పోలవరం గైడ్‌బండ్‌కు తామిచ్చిన డిజైన్ సరిగానే ఉందని, అందులో ఎలాంటి ఇబ్బంది లేదని కేంద్ర జలసంఘం అన్నట్లు తెలిసింది. లోపం ఎక్కడ జరిగిందని కేంద్రమంత్రి ప్రశ్నించగా.. ప్రాథమికంగా కొన్ని అంశాలపై చర్చ జరిగింది. క్షేత్రస్థాయిలో అనేక పేరామీటర్లు మారిపోయాయని, మట్టిలో తేడాలు రావడంతో కుంగి ఉంటుందని పేర్కొన్నారు. అన్ని అంశాలను అంచనా వేసి తగిన చర్యలు తీసుకోవాలి కదా అని ఈ సందర్భంగా కేంద్రమంత్రి నిలదీశారు. మధ్యలో వరదలు రావడంతో మట్టి తీరు మారిపోయిందని అధికారులు చెప్పారు. ఒకరిపై ఒకరు బాధ్యత నెట్టుకోవడంతో మరింత లోతుగా చర్చించారు. డిజైన్లు సమర్పించిన రాష్ట్ర జలవనరులశాఖ.. 4 నెలల్లో గైడ్‌బండ్‌ను పూర్తిచేస్తామని ఎందుకు చెప్పిందని ప్రశ్నించారు.
గడువులోగా నిర్మాణం పూర్తిచేయకపోతే ఆకృతుల అంశంపై దృష్టి సారించాలి కదా అనే చర్చ జరిగింది. సీ.ఎస్.ఎమ్.ఆర్.ఎస్ సంస్థ ఎందుకు పరీక్షలు చేయలేదని, నిర్మాణ సమయంలో ఎప్పటికప్పుడు ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నించారు. పరీక్షలు చేయనివ్వడం లేదని ఆ సంస్థ ప్రతినిధి జవాబివ్వగా.. ఎవరు అడ్డుకుంటున్నారు, ఎందుకు అడ్డుకుంటున్నారని షెకావత్ ప్రశ్నలు సంధించారు. 4 నెలల్లో పూర్తిచేయాల్సిన నిర్మాణం రెండు సీజన్లు ఆలస్యం చేశారని, వరదలతో మట్టి తీరు మారిపోవడాన్ని ప్రాథమిక నివేదికలో కారణంగా పేర్కొన్నారు.
HC on Polavaram Illegal Mining: పోలవరం వద్ద అక్రమ తవ్వకాలపై హైకోర్టులో విచారణ
పోలవరం తొలిదశలో మిగిలి ఉన్న పనులకు, +41.15 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తే నిర్వాసితులయ్యే వారి తరలింపునకు.. 12వేల 911.15 కోట్ల రూపాయల మంజూరుకు కేంద్ర ఆర్థికశాఖ ఇప్పటికే ఆమోదం తెలిపింది. మరో 36 ఆవాసాల్లో 16వేల 642 మంది నిర్వాసితుల తరలింపునకు అయ్యే 5వేల 127 కోట్ల రూపాయలను కూడా ఇవ్వాలని రాష్ట్ర జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ కోరారు. దీనికి కేంద్రమంత్రి షెకావత్ సానుకూలంగా స్పందించారు. పోలవరం అథారిటీ పరిశీలించి జులై 15లోగా కేంద్ర జలసంఘానికి సమర్పించాలని సూచించారు. అక్కడి నుంచి జులై 31లోగా కేంద్ర జల్‌శక్తి శాఖకు పంపాలని ఆదేశించారు.
ఇక పోలవరం పనుల పురోగతిపై ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రధాన డ్యాంలో అగాథాలు ఏర్పడ్డచోట ఇసుక నింపి, వైబ్రో కాంపాక్షన్ పనులు చేసిన అంశాన్ని సమగ్రంగా పరిశీలించే బాధ్యతలు సబ్ కమిటీకి అప్పజెప్పారు. ప్రధాన డ్యాం రెండో భాగంలో పాక్షిక డయాఫ్రం వాల్ నిర్మించి "U" ఆకారంలో పాత డయాఫ్రం వాల్‌కు అనుసంధానిస్తే సరిపోతుందని ఎన్.హెచ్.పీ.సీ నివేదిక ఇచ్చింది. అలా కాకుండా కొత్తగా పూర్తిస్థాయి డయాఫ్రం వాల్ నిర్మించాలని కేంద్ర జలసంఘంలోని కొందరు సూచిస్తున్నారు. దీనిపై కూలంకషంగా చర్చించి నిర్ణయించాలని సమావేశంలో నిర్ణయించారు.