young girl in a hospital: ఆ దంపతులు కూలీ చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటున్నారు! చదువు, ఆటల్లోనూ వారి బిడ్డలు రాణిస్తున్నారు. ఇంతలో వారి జీవితాలను ఓ రోడ్డు ప్రమాదం తలకిందులు చేసింది. మద్యం మత్తులో ఇద్దరు యువకులు పెద్ద కుమార్తెను బైక్‌తో ఢీకొట్టారు. కోమాలోకి వెళ్లిపోయిన ఆ బాలిక.. దాదాపు 20 రోజులుగా మృత్యువుతో పోరాడుతోంది. వైద్యానికి ఆర్థిక స్థోమత సరిపోక... సాయం కోసం ఆ దంపతులు ఆశగా ఎదురుచుస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం సుబ్బరాయపురం గ్రామానికి చెందిన రాపాక శ్రీను, లక్ష్మీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు వీరివి. కాయా కష్టం చేసుకుంటూ ముగ్గురు పిల్లలనీ చదివించుకుంటున్నారు. పెద్ద కుమార్తె ఝాన్సీ శ్రీలక్ష్మి.. కృష్ణంపాలెం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. ఈ నెల 10న పాఠశాల నుంచి చెల్లితో కలిసి ఇంటికి తిరిగొస్తుండగా.. ఇద్దరు యువకులు మద్యం మత్తులో బైక్‌తో బలంగా ఢీ కొట్టారు. ఝాన్సీ తలకు బలమైన గాయమైంది. బాలికను రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. కోమాలోకి వెళ్లిపోయిన ఝాన్సీకి.. రోజుకు 40వేల రూపాయల వరకు వైద్య ఖర్చవుతోందని.. తల్లిదండ్రుల చెబుతున్నారు. ఇల్లుని అమ్మేశారు. తెలిసిన వాళ్లు, గ్రామస్థులు చేసిన ఆర్థిక సహాయంతో ఇప్పటి వరకు వైద్యం చేయించారు. ఇంకా నెల రోజులకు పైగానే చికిత్స అందించాలని వైద్యులు చెబుతున్నారు.