సంక్రాంతి సందర్భంగా కోడి పందేల నిర్వహించకూడదని పోలీసులు హెచ్చరికలు చేస్తున్నా... వాటిని లెక్కచేయకుండా బరుల ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. ఎవరి పని వారిదే అన్నట్లుగా కోనసీమ వ్యాప్తంగా ఇప్పటికే బరులు సిద్ధమయ్యాయి. ఏటా పోలీసులు హెచ్చరికలు జారీ చేయడం.. పండుగ మూడు రోజులూ బరుల వైపు కన్నెత్తి చూడకపోవడం సర్వ సాధారణమైంది. దీంతో పందేల నిర్వహణకు అడ్డు ఉండదనే నమ్మకంతో దూసుకుపోతున్నారు.
కోనసీమలో ప్రధానంగా తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం కేశనకుర్రులో భారీస్థాయిలో బరిని ఏర్పాటు చేశారు. ఇక్కడ పోలీసులు హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయగా.. షటిల్ టోర్నమెంట్ పేరుతో ఫ్లెక్ష్సీని పెట్టి మరీ ఏర్పాట్లు పూర్తి చేశారు.
వివిధ మండలాల్లో...
వీఐపీలు ఆసీనులయ్యేందుకు కుర్చీలు, షామియానాలు, భారీ టెంట్‌లను సిద్ధం చేశారు. ఇక్కడ గుండాట నిర్వహణకు రూ. 45 లక్షలు చెల్లించేందుకు ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. ఇదే మండలంలో మురమళ్ల, ఎదుర్లంక, కొమరగిరి... గుత్తెనదీవి ముమ్మిడివరం మండలంలో కొత్తలంక, రాజుపాలెం, పల్లిపాలెం... కాట్రేనికోన మండలంలో చెయ్యేరు, గెద్దనపల్లి... తాళ్లరేవు మండలంలో పిల్లంక, గోవలంక... అల్లవరంలో మండలంలో గుడ్డివానిచింత, కొమరగిరిపట్నం, గోడిలంక... ఉప్పలగప్తం మండలంలో వాడపర్రు, ఎన్.కొత్తపల్లి, గొల్లవిల్లి, చల్లపల్లిలో బరులను ఏర్పాటు చేశారు. ఈ బరుల స్థాయిని బట్టి రూ.రెండు లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు గుండాట, కోడిపందేల నిర్వహణకు వేలంపాటలు జరిగినట్లు సమాచారం.
పట్టుకోసం.. పాకులాట..
సంక్రాంతికి కోడిపందేలను నిర్వహించకపోతే గ్రామంలో పట్టును కోల్పోతామన్న భావనతో నాయకులు అండదండలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఎంత భారీ స్థాయిలో పందేలకు ఏర్పాట్లు చేస్తే.. అంత పేరు వస్తుందనే పరిస్థితికి చేరింది. 2018 ఏడాదిలో ఐ.పోలవరం మండలం మురమళ్లలో భారీ స్థాయిలో పందేల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. అప్పట్లో డ్రోన్ కెమెరాలతో చిత్రీకరణ, ఎల్‌సీడీ తెరలను అమర్చడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఇలా నాయకులు తమ పట్టు కోసం.. పందేల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా కోడిపందేల నిర్వహణకు వెనకాడేది లేదనే విధంగా ఏర్పాట్లు ఉంటున్నాయి.
ఇదీ చదవండి:చీరలందు ఈ 'గడ్డి చీర' వేరయా.. ఉతికితే.. ఎలా మరి?