Untimely Rains Damaged Crops: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా సోమవారం కురిసిన వర్షాలకు.. తూర్పు, మధ్య డెల్టా ప్రాంతంలో ధాన్యం రాశులు తడిసి ముద్దయ్యాయి. మంచి దిగుబడులు వచ్చాయన్న ఆనందాన్ని.. అకాలవర్షాలు రైతుకు లేకుండా చేశాయి . తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం, అనపర్తి, రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గాల్లో కురిసిన వర్షాలకు.. ఆరబెట్టిన ధాన్యంతోపాటు కల్లాల్లోని వరి పంట తడిసిపోయింది.
కొన్ని చోట్ల చేతికొచ్చిన పంట నేలకొరిగింది. కోతలు పూర్తయినా ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడం, సంచుల కొరత, రోజుకో నిబంధన వంటి కారణాలతో.. రైతులు పొలం గట్లు, రహదారులు, పొలాల్లో ధాన్యాన్ని నిల్వచేశారు. ఇప్పుడు అకాల వర్షాల కారణంగా తడిసి పాడైపోయిన ధాన్యాన్ని చూసి.. తల్లడిల్లిపోతున్నారు.
కోనసీమ జిల్లాలో దాదాపు 3 వేల ఎకరాల్లో కోతకు వచ్చిన పంట నేలవాలినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. కాకినాడ జిల్లాలోని 9 మండలాల పరిధిలో వరి పంటకు ఎక్కువ నష్టం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో 200 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న, నిడదవోలు, కొవ్వూరు నియోజకవర్గాల్లో వరికి తీవ్ర నష్టం వాటిల్లింది. ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం శాపంగా మారిందని రైతులు వాపోతున్నారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనూ.. సంచుల కొరత, ధాన్యం తరలింపులో ఆలస్యం కారణంగా.. రోడ్లపై ఆరబోసిన ధాన్యం రాశులు.. తడిసిముద్దయ్యాయి. జిల్లాలో ఇప్పటికే సగానికి పైగా వరి కోతలు పూర్తికాగా.. కల్లాలు, రోడ్లపై ధాన్యం రాశుల్ని పోసి.. సంచుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.