తూర్పుగోదావరి జిల్లా దొడ్డిగుంట గ్రామం... ఇప్పుడు వార్తల్లో మార్మోగుతోంది. రంగంపేట మండలంలోని ఈ వ్యవసాయాధారిత పల్లె కవల పిల్లలకు ప్రసిద్ధి. 4 వేలకు పైగా జనాభా ఉండే ఈ గ్రామంలో ప్రస్తుతం 60 కవల జంటలు ఉన్నాయి. ఇప్పటికీ కవల పిల్లల జననం కొనసాగుతూనే ఉంది. ఒకే మొహాన్ని పోలిన అన్నా చెల్లెళ్లు, అన్నాదమ్ముళ్లు ఊరంతా కనిపిస్తారిక్కడ. దొడ్డిగుంటతో పాటు చుట్టు పక్కల గ్రామాల్లోనూ కవలలు కనువిందు చేస్తుంటారు. ఆ ఊరి అమ్మాయిని వేరే ప్రాంతానికి చెందిన అబ్బాయి పెళ్లి చేసుకున్నా... వారికి కవల పిల్లలు పుడుతున్నారు.
ఆ ఊరి బావినీళ్లు తాగితే.. పుట్టేది కవలలే..! - twins
గ్రామంలో ఒక కవలల జంట ఉంటేనే వారిని తదేకంగా చూస్తుంటాం. అలాంటిది 60 కవలల జంటలు ఒకే ఊరిలో కనిపిస్తే.. ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. తూర్పుగోదావరి జిల్లాలోని ఓ గ్రామానికి వెళ్లినవారికి ఇలాంటి అనుభూతే కలుగుతుంది. తరతరాల నుంచి నేటివరకు ఈ గ్రామంలోని తల్లులు.. కవల పిల్లలకు జన్మనిస్తూనే ఉన్నారు.
నూతి నీరే కారణమా?
దొడ్డిగుంట ఇంతటి ప్రాచుర్యం పొందటానికి.... ఊరంతా తాగే బావి నీరే కారణమని స్థానికులు అంటున్నారు. గ్రామానికి దూరంగా పొలాల మధ్య పూర్వీకులు తవ్వించిన బావి నీటి మహత్యమే కవలలు జన్మించడానికి ప్రధాన కారణమని అంతా నమ్ముతుంటారు. స్వచ్ఛమైన ఈ జలాన్నే ఏడాది పొడవునా స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల వారు వినియోగిస్తుంటారు. రక్షిత మంచినీటి పథకం ద్వారా నీరు సరఫరా చేస్తున్నా... ఇప్పటికీ నూతి నీటినే తాగుతున్నారు. ప్రస్తుతం ఈ బావి నీటికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. రాష్ట్రం నుంచే కాకుండా హైదరాబాద్, విశాఖ, బెంగళూరు, పుదుచ్చేరి ఇలా అనేక ప్రాంతాల నుంచి దొడ్డిగుంట బావి నీటి కోసం జనం వస్తున్నారు. అమెరికాకు సైతం ఈ జలాలు పంపించామని స్థానికులు చెప్పడం విశేషం.
కవల పిల్లల నుయ్యి
దొడ్డిగుంట బావి నీరుకు విశేష ఆదరణ లభిస్తున్నందున... వీటిని రక్షించేందుకు స్థానికులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ బావిని అందరూ గుర్తించేలా ''కవల పిల్లల నుయ్యి'' అనే పేరుతో బోర్డులు ఏర్పాటు చేశారు. అలాగే నీటిని ఉచితంగా వినియోగించుకునేందుకు దొడ్డిగుంట వాసులు చర్యలు చేపట్టారు.