తూర్పు మన్యంలో.. దశాబ్దాలుగా మరణ ఘోష వినిపిస్తోంది.. ఆయా మరణాలకు వ్యసనాలు, అనారోగ్య పరిస్థితులే కారణాలుగా కనిపిస్తున్నాయి. చావుకేక వినిపించినప్పుడు హడావుడి తప్ఫ. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే చొరవే కరవవుతోంది.. కాయకష్టమే తెలిసిన అమాయక గిరిజనం ఆరోగ్యం.... వ్యసనాలకు బానిసై గుల్లవుతోంది.. కొందరు అనారోగ్యంతో మంచాన పడితే.. మరికొందరు అర్ధంతరంగా తనువు చాలించడం కలవరపెడుతోంది. రాజవొమ్మంగి మండలం లోదొడ్డిలో జీలుగు కల్లు తాగి ఐదుగురు మృత్యువాత పడటంతో తూర్పు ఉలిక్కిపడింది.
అసలు ఏం జరుగుంటుంది?...
రాజవొమ్మంగి మండలంలోని లోదొడ్డిలో ఐదుగురి ఉసురుతీసిన ఘటనపై పోలీసు, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంటు బ్యూరో (సెబ్), వైద్యారోగ్యశాఖ, అబ్కారీ, రెవెన్యూ ఇతర శాఖలు లోతుగా దృష్టిసారించాయి. చెట్టులో కల్లు ఉన్నప్పుడు విష ప్రయోగం జరిగిందా..? కీటకాల ప్రభావంతో విషపూరితం అయిందా..? తీసి కాచి తాగే క్రమంలో ఏమైనా లోపాలు చోటుచేసుకున్నాయా..? అనే దానిపై స్పష్టత రావాల్సిఉంది. నమూనాలు పరీక్షించి ప్రాథమిక నివేదిక వెల్లడైతే లోదొడ్డిలో మృత్యుఘోషపై స్పష్టత వచ్చే వీలుంది. అయిదుగురి ఉసురు తీసిన జీలుగు కల్లు నమూనాలు యంత్రాంగం సేకరించింది. కాకినాడలోని అబ్కారీ శాఖ ప్రాంతీయ పరీక్ష కేంద్రంలో పరీక్షించిన తర్వాత.. కారణాలపై స్పష్టత వచ్చేవీలుందని అబ్కారీశాఖ డీసీ చైతన్యమురళి తెలిపారు. మన్యంలో నాటుసారా, గంజాయి నిర్మూలనకు పోలీసు శాఖ ‘పరివర్తన’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఐటీడీఏ, ఐసీడీఎస్, వైద్యారోగ్యశాఖల ఆధ్వర్యంలో ఆరోగ్య, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. రూ.కోట్లు ఖర్చవుతున్నా.. ఆయా శాఖల చొరవ ఫలితం అంతగా కనిపించడంలేదు. తూర్పుగోదావరి జిల్లా 36 మండలాల్లో నాటుసారా, కల్లు మత్తు తీవ్రత ఉంది.
కుట్రకోణమా..?
కిక్కు కోసం కల్లులో కలిపిన బెరడులు వికటించాయా? ఇతర కుట్ర కోణమా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఓ వాలంటీరుకు మృతుల కుటుంబాల మధ్య వైరుధ్యమూ కారణమనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో విష ప్రయోగం జరిగిందా.? అనే వాదన వస్తోంది. కల్లు కుండ నుంచి క్రిమిసంహారక మందు వాసన రావడంతో ఎవరో ఏదో కలిపి ఉంటారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
మరింత లోతుగా విచారణ...