Tension in farmer march: అమరావతి రైతుల మహాపాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో చివరి రోజు తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగింది. మూడు రాజధానులకు మద్దతుగా వైకాపా నేతలు నల్లబెలూన్లు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేయడంతో.. ఒకానొక సమయంలో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఎవరెన్ని కవ్వింపు చర్యలకు పాల్పడినా రైతులు సంయమనం కోల్పోకుండా.. జైఅమరావతి అని నినదిస్తూ ముందుకు సాగారు.
పాదయాత్రకు వేల్పూరులో ప్రజలు అపూర్వ మద్దతు అందించారు. అమరావతికి సంఘీభావం తెలుపుతూ మండపాక మహిళలు పూలు, పండ్లు అందించారు. బొట్టు పెట్టి గ్రామంలోకి ఆహ్వానించారు. పాదయాత్ర తణుకు చేరుకునే సరికి.. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యాన నరేంద్ర కూడలిలో మూడు రాజధానులకు మద్దతుగా భారీ ఫ్లెక్సీలు వెలిశాయి. వికేంద్రీకరణ పేరిట వైకాపా నేతలు పెద్దసంఖ్యలో మహిళలను తీసుకువచ్చారు. వారంతా నల్ల కండువాలు వేసుకుని ప్లకార్డులు ప్రదర్శించారు. గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్లు, మున్సిపల్ సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. ఈ క్రమంలో వైకాపా మద్దతుదారులు, అమరావతి రైతులు పెద్దఎత్తున తమతమ నినాదాలు చేశారు. రైతులను అడ్డుకునేందుకు వైకాపా వర్గీయులు యత్నించినా.. నిలువరించేందుకు పోలీసులు కనీస ప్రయత్నం కూడా చేయలేదు. వైకాపా వర్గం ఎంత కవ్వించినా చలించని రైతులు.. అమరావతి నినాదాలు చేస్తూ ముందుకు సాగారు.
తణుకు మున్సిపల్ కార్యాలయం, మహాలక్ష్మమ్మ గుడి మీదుగా జాతీయ రహదారిపైకి పాదయాత్ర చేరుకోగా.. పెద్దఎత్తున మహిళలు తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు. రైతులపై పూలు చల్లి హారతులు పట్టారు. అక్కడి నుంచి పాలంగి మీదుగా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని ఉండ్రాజవరానికి పాదయాత్ర చేరింది. 31వ రోజు దాదాపు 20 కిలోమీటర్ల మేర నడిచారు.