ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TDP Mahanadu: ఎన్టీఆర్‌ శతజయంతి వేళ.. చరిత్రలో నిలిచిపోయేలా మహానాడుకు ఏర్పాట్లు - mahanadu rajamandry

TDP Mahanadu: పసుపు పండుగ మహానాడుకు సర్వం సిద్ధమైంది. ఎన్టీఆర్ శత జయంతి వేళ.. మహానాడును చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని.. తెలుగుదేశం భావిస్తోంది. వచ్చే ఎన్నికలకు శ్రేణులను సన్నద్ధం చేయడంతో పాటు.. రాజకీయ విధానాలు, ఎన్నికల మేనిఫెస్టో ప్రాథమిక అంశాలపై మహానాడు వేదికగా చంద్రబాబు స్పష్టత ఇవ్వనున్నారు.

Etv Bharat
Etv Bharat

By

Published : May 26, 2023, 9:32 PM IST

చరిత్రలో నిలిచిపోయేలా మహానాడుకు ఏర్పాట్లు

TDP Mahanadu: నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీలో మహానాడుది కీలక భూమిక. పార్టీ అధికారంలో ఉన్నా.. లేకున్నా కార్యకర్తలు, పార్టీ ప్రతినిధులతో ఏటా మే 27, 28, 29తేదీల్లో మహానాడు నిర్వహించడం ఆనవాయితీ. తొలిరోజు పార్టీ ప్రతినిధుల సభ, రెండోరోజు పార్టీ వ్యవస్ధాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహిస్తారు. రాజమహేంద్రవరం వేదికగా ఈసారి మహానాడు నిర్వహించేందుకు తెలుగుదేశం సిద్ధమైంది. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు, తెలుగుదేశం 41 వసంతాల ప్రస్థానం, కార్యకర్తల సంక్షేమం సహా ఏపీ, తెలంగాణకు సంబంధించిన తీర్మానాలను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ వేడుకలో ఎన్నికల మేనిఫెస్టో ప్రాథమిక అంశాలు వెల్లడించాలని చంద్రబాబు నిర్ణయించారు. దసరాకి పూర్తిస్థాయి మేనిఫెస్టో ప్రకటించే ఆలోచనలో పార్టీ అధినాయకత్వం ఉంది.

మహానాడులో ఈసారి కొత్తవారితో మాట్లాడించనున్నారు. వాక్చాతుర్యం బాగున్న 30 మందికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి మహానాడు తీర్మానాలపై మాట్లాడేలా సిద్ధం చేశారు. కీలకమైన రాజకీయ తీర్మానంలో పొత్తులు, జాతీయ రాజకీయాల్లో వ్యవహరించాల్సిన తీరుపై ప్రత్యేక ప్రస్తావన తీసుకురానున్నట్లు తెలుస్తోంది. సభకు సుమారు 15 లక్షల మంది వస్తారన్న ప్రాథమిక అంచనా మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి వేదిక మీద 320 మందికి కూర్చొనే అవకాశం కల్పించనున్నారు.

రాజమహేంద్రవరంలోని వేమగిరిలో దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో మహానాడు వేడుక జరగనుంది. సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రధాన వేదిక నిర్మించారు. 15 వేల మంది కూర్చొనేలా 9 గ్యాలరీలు ఏర్పాటు చేసి కూలర్లు అమర్చారు. తెలుగుదేశం పాలనా ఘనతలను తెలియజేసే డిజిటల్ ఫొటో ఎగ్జిబిషన్లు ఉంటాయి. ఈసారి లోకేశ్‌ యువగళం పాదయాత్ర విశేషాలు ఎగ్జిబిషన్‌లో ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. రక్తదానం శిబిరం, సభ్యత్వ నమోదు, విరాళాల సేకరణకు ఏర్పాట్లు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పసుపు సైనికుల కోసం నోరూరించే వంటకాలను సిద్ధం చేస్తున్నారు. 28వ తేదీన ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా చంద్రబాబుతో పాటు పార్టీ ముఖ్యనేతలంతా రాజమహేంద్రవరంలోని కోటిపల్లి బస్టాండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు.

ఈ సారి మహానాడులో బలహీన వర్గాల అంశాన్ని ప్రధానంగా చర్చకు తీసుకుంటున్నాం. యువత, మహిళలను ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు దిశా నిర్దేశం చేయబోతున్నాం. మరలా ప్రజానికానికి సమర్థవంతమైన పాలన ఏ విధంగా అందిస్తామనే సందేశాన్ని ఇవ్వబోతున్నాం. మేనిఫెస్టో ఏ రకంగా ఉంటుందని అధ్యక్షులు ఒక సంకేతాన్ని ఇస్తారు. దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ముసాయిదాని దసరా నుంచి ఎలక్షన్ల ముందు వరకు ప్రజల్లో ఒక చర్చనీయాంశంగా పెట్టి వారి నుంచి అభిప్రాయాలను సేకరించి తుది మేనిఫెస్టో ఇవ్వాలని నిర్ణయించాం.- అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు

ABOUT THE AUTHOR

...view details