కాకినాడ ప్రభుత్వాసుపత్రి... ఉభయ గోదావరి జిల్లాలతోపాటు విశాఖ శివారు ప్రాంతాల ప్రజలకు సేవలందిస్తోంది. నిత్యం వేలమంది రోగులతో రద్దీగా ఉండే ఈ ఆస్పత్రిలో 40 విభాగాలున్నాయి. కీలకమైన ప్రసూతి విభాగానికి గర్భిణులు ప్రసవం కోసం పెద్దసంఖ్యలో వస్తుంటారు. రోజుకు దాదాపు 60మంది ప్రసవిస్తుంటారు. ప్రసవం తేదీ దగ్గర పడిన గర్భిణులు ముందుగానే ఆస్పత్రిలో చేరతారు. అందరికీ సరిపడ పడకల్లేక... ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తల్లీపిల్లల విభాగంలో బాలింతలను ఉంచుతున్నారు. ఇక్కడ ప్రతి పడకపై ఇద్దరు బాలింతలతోపాటు పుట్టిన శిశువులు ఉండాల్సి వస్తోంది. కొన్ని పడకలపై ముగ్గురు బాలింతలు ఉండాల్సిన దుస్థితి నెలకొంది. మండువేసవిలో చిన్న పడకపై వీరు పడుతున్న అవస్థలు చెప్పలేని పరిస్థితి. శస్త్రచికిత్స చేయించుకున్నవారి బాధలు వర్ణణాతీతం. గాలి తగలక... ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గదులు ఇరుకుగా ఉన్నందున ఇంటి నుంచి తెచ్చే ఫ్యాన్లు వినియోగించుకోలేకపోతున్నారు.
ఇబ్బంది వాస్తవమేనని జీజీహెచ్ సూపరింటెండెంట్ రాఘవేంద్రరావు అంగీకరించారు. ఆస్పత్రికి మంచి పేరు ఉన్న కారణంగా 3జిల్లాల నుంచి గర్భిణులు వస్తుంటారని ఎవరినీ వెనక్కి తిప్పి పంపలేకపోతున్నామని వివరించారు. నూతనంగా నిర్మిస్తున్న భవనం అందుబాటులోకి వస్తే సమస్యలుండవని తెలిపారు.