కరోనా కారణంగా పలు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంఘటనలు ఉన్నాయి. జూలై, ఆగస్టు నెలల్లో ఆక్సిజన్ అందక తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ కొవిడ్ ఆసుపత్రిలో పలువురు మృతిచెందడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం అలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. ఆసుపత్రిలోని ప్రతిపడకకూ ఆక్సిజన్ అందేలా చర్యలు తీసుకుంది. ఇప్పుడున్న ఆరువేల లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంటుకు అదనంగా మరో 10వేల లీటర్ల ప్లాంటును ఏర్పాటు చేశారు. ఏపీఎంఎండీసీ నుంచి కేటాయించిన ప్లాంటును లిండ్సే కంపెనీ ప్రతినిధుల ఆధ్వర్యంలో 300 పడకలకు పైపుల ద్వారా అనుసంధానం చేశారు.
నిర్వహణ భారం లేకుండా..
ప్రస్తుతం ఆసుపత్రిలోని ఆరువేల లీటర్ల ట్యాంకు ద్వారా 410 ఆక్సిజన్ పడకలకు పూర్తిస్థాయిలో ప్రాణవాయువు అందడం లేదు. దీంతో కొన్ని పడకలకు సిలిండర్ల ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నారు. సిలిండర్లు పెట్టినప్పుడు వాటిని ఎప్పటికప్పుడు మార్చాల్సిన పరిస్థితి. నిర్వహణ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు 10 వేల లీటర్ల ట్యాంకు ద్వారా అన్ని పడకల వద్దకు పైపులతో ఒత్తిడి అధికంగా ఉండేలా ఆక్సిజన్‌ను అందించి రోగులకు ఇబ్బందులు తొలగిస్తున్నారు.
110 వెంటిలేటర్లకు వీలుగా..
ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న 110 వెంటిలేటర్లకు సాధారణ సిలిండర్ల ద్వారా పూర్తిస్థాయి ఒత్తిడితో ఆక్సిజన్ అందే పరిస్థితి లేదు. దీని వల్ల టెక్నీషియన్లకు నిర్వహణ భారం ఉండేది. నిత్యం పర్యవేక్షణ చేయాల్సిన పరిస్థితి. ప్రస్తుతం లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంటు ద్వారా ప్లాంటులోని లిక్విడ్ ఆక్సిజన్ గ్యాస్ రూపంలో మారి కావాల్సిన ఒత్తిడితో వెంటిలేటర్ ద్వారా రోగికి అందుతుంది. తద్వారా రోగులకు పూర్తిస్థాయిలో ఇబ్బందులు తొలగుతాయి.