తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం వల్లూరు గ్రామంలో.. ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి సర్పంచ్ గా ఎన్నికైన.. మీనా కుమారి విషయంలో వైకాపా నాయకులు అనుచితంగా ప్రవర్తించారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. అయితే.. పోలీసులు వైకాపా నాయకులపై కేసులు నమోదు చేయకుండా మౌనంగా ఉండటం దారుణమని దుయ్యబట్టారు.
ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఆయన అనుచరులు.. తనకు గౌరవానికి భంగం వాటిల్లే విధంగా ప్రవర్తించారని సర్పంచ్ మీనా కుమారి పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదని నిలదీశారు. గ్రామ సర్పంచ్ కి దక్కాల్సిన ప్రొటోకాల్ కూడా ఇవ్వకుండా.. అవమానించిన వారిపై చర్యలు తీసుకొనేందుకు పోలీసులు వెనకాడుతున్నారని, ఇందుకు అధికార పార్టీ ఒత్తిళ్లే కారణమని ఆరోపించారు.