గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరానికి వరద ప్రవాహం పెరుగుతోంది. బ్యారేజి నుంచి ఈరోజు ఉదయం 6 గంటలకు మూడు లక్షల 26 వేల క్యూసెక్కుల వరద నీటిని వదిలారు. ఈ కారణంగా.. గౌతమి వశిష్ఠ, వైనతేయ గోదావరి నదీ పాయలలో నీటి మట్టం క్రమేపీ పెరుగుతోంది. రానున్న రెండు రోజుల్లో బ్యారేజీ నుంచి నీటి విడుదల 8 నుంచి 9 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వర్షాలకు కాటన్ బ్యారేజీ ఎగువన నీటిమట్టాలు క్రమంగా పెరుగుతున్నాయని, రాజమహేంద్రవరం పాత రైల్వే వంతెన వద్ద శుక్రవారం 13.170 మీటర్ల నీటి మట్టం ఉందని అన్నారు.
ముంపు గ్రామాలు అప్రమత్తం..
పి.గన్నవరం నియోజకవర్గంలోని బూరుగు లంక రేవులో నాలుగు లంక గ్రామాలు ఉన్నాయి. రాకపోకలు సాగించేందుకు వీలుగా తొమ్మిది నెలల క్రితం వీరు తాత్కాలిక రహదారి వేసుకున్నారు. ఇప్పుడు వరదనీటి ప్రవాహం పెరుగుతుండటంతో తాత్కాలిక రహదారి కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు సాయంత్రానికల్లా ఈ రేవులోకి వరద నీరు చేరి తాత్కాలిక రహదారి కొట్టుకుపోతుందని స్థానికులు తెలిపారు. దీంతో ముందస్తుగా పడవలను సిద్ధం చేసుకుంటున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ద్విచక్ర వాహనాలను బూరుగు లంక వైపు పెట్టుకుంటున్నారు.
వరద నీటితో శుక్రవారం సాయంత్రానికి దేవీపట్నం జలదిగ్బంధంలో చిక్కుకుంది. పోశమ్మగండి వద్ద ఇళ్లలోకి, గండిపోశమ్మ ఆలయంలోకి నీరు చేరింది. పోశమ్మగండి-పి.గొందూరు మార్గం, పూడిపల్లి వద్ద, దేవీపట్నం-తొయ్యేరు గ్రామాలను నీరు చుట్టుముట్టింది. కె.వీరవరం గ్రామస్థులకు పునరావాస కాలనీలు నిర్మించకపోవడంతో వారు ఇతరులకు నిర్మించి ఖాళీగా ఉన్న ఇళ్లలో తలదాచుకుంటున్నారు. ఎగువ కాఫర్‌డ్యాం పైభాగంలో నీరు పెరుగుతుండడంతో ముంపుగ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. శుక్రవారం పోలవరం నుంచి దిగువకు 2.11 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. స్పిల్‌వే వద్ద సాయంత్రానికి 28.50 మీటర్లకు వరద పెరిగింది.
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద