తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలంలోని ప్రభుత్వ పోరంబోకు భూములపై అక్రమార్కుల కన్నుపడింది. అక్కడి సుద్ద మట్టిని విచ్ఛలవిడిగా తవ్వేస్తున్నారు. భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టడం వల్ల వంద అడుగులకు పైగా గోతులు ఏర్పడ్డాయి. స్థానిక ఎమ్మెల్యేకు సన్నిహితుడైన ఓ వ్యాపారి అక్రమంగా మట్టి తవ్వకాలు సాగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అందుకే అధికారులు సైతం ఆ వైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
జగ్గయ్యపేట మండలం రాయవరంలోని.. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం సమీపంలోని 107, 109 సర్వే నెంబర్లలో ఏడెకరాల వరకు ప్రభుత్వ పోరంబోకు భూమి ఉంది. ఈ భూమిలో సుద్ద నిల్వలు మెండుగా ఉన్నాయి. కొందరు బడాబాబుల కన్నుపడటంతో ఈ ప్రాంతంలో అక్రమ తవ్వకాలకు తెరలేచింది. భారీ యంత్రాలతో రంగంలోకి దిగి... రాత్రి వేళల్లోనూ విద్యుత్ వెలుగులతో పెద్ద ఎత్తున సుద్దను తరలిస్తున్నారు. ఇటీవల సుద్దను తరలిస్తున్న వాహనాలను స్థానికులు అడ్డుకోగా.... ఓ నాయకుడి పేరు చెప్పి బెదిరించారు. అధికారులు చేరుకునేలోపు వాహనాలను తరలించారు.