ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Grasim Industry: గ్రాసిమ్ పరిశ్రమలో స్థానికులకు 75 శాతం ఉపాధి: జగన్

CM Jagan Inaugurated Grasim Industry: తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో గ్రాసిమ్‌ పరిశ్రమ కాస్టిక్‌ సోడా యూనిట్‌ను ముఖ్యమంత్రి జగన్​ ప్రారంభించారు. దీని ద్వారా 75 శాతం స్థానికులకు ఉపాధి లభిస్తుందని జగన్​ అన్నారు. గ్రాసిమ్‌ పరిశ్రమ ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆదిత్య బిర్లా గ్రూప్‌ సంస్థ ముందుకురావడం శుభపరిణామమన్నారు.

CM Jagan Inaugurated Grasim Industry
CM Jagan Inaugurated Grasim Industry

By

Published : Apr 21, 2022, 2:50 PM IST

Updated : Apr 22, 2022, 3:55 AM IST

CM Jagan on Grasim Industry: పరిశ్రమల స్థాపనే ప్రగతికి సోపానమని, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌-క్లోర్‌ ఆల్కలీ పరిశ్రమతో రాష్ట్రానికి రూ.2,470 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో గ్రాసిం ఇండస్ట్రీస్‌-క్లోర్‌ ఆల్కలీ (కాస్టిక్‌ సోడా) పరిశ్రమను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఈ పరిశ్రమ స్థాపనతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,450 మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. గ్రాసిమ్‌ పరిశ్రమలో స్థానికులకు 75% ఉద్యోగాలు ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించింది. ఈ పరిశ్రమ ఏర్పాటుకు ముందునుంచి అవరోధాలు ఉన్నాయి. గత ప్రభుత్వం ఎన్నికలకు 2 నెలల ముందు పరిశ్రమను గ్రాసిమ్‌ సంస్థకు అప్పగించింది. కానీ సమస్యలు పరిష్కరించకుండా సంతకాలు చేసినంత మాత్రాన పరిశ్రమలు రావు. సమస్యలను అధిగమించి గ్రాసిమ్‌ ముందడుగు వేసింది’ అన్నారు.

గ్రాసిమ్ పరిశ్రమలో స్థానికులకు 75 శాతం ఉపాధి: జగన్

భయాలన్నీ పోయాయి
‘గతంలో పరిశ్రమ ఏర్పాటైతే.. కాలుష్యంతో గ్రామాల్లో అనారోగ్యం ఆవరిస్తుందని భయం ఉండేది. థర్మల్‌ ప్లాంటుతో నిర్వహణ సాగితే మరింత ప్రమాదమని సందేహాలు వచ్చాయి. అందుకే థర్మల్‌ ప్లాంటు ఏర్పాటు చేయకూడదనే నిబంధనతో పరిశ్రమ పెట్టారు. పారిశ్రామిక వ్యర్థాలతో నీటి కాలుష్యం జరగకుండా ఎలక్ట్రాలసిస్‌ పరిజ్ఞానంతో జీరో లిక్విడ్‌ డిశ్ఛార్జి విధానం ద్వారా కాలుష్యానికి తావు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని యాజమాన్యం చెప్పింది. ఆ తర్వాతే పరిశ్రమ ఏర్పాటుకు అంగీకరించాం. ఈ పరిశ్రమ నుంచి వచ్చే సీఎస్సార్‌ నిధులతో చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధికి వీలుంది. కుమార మంగళం బిర్లా అనుభవాలు రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి బాటలు వేయాలి, దేశం నలుమూలల నుంచి రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు దోహదం చేయాలి’ అని సీఎం జగన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో పరిశ్రమ ఏర్పాటు సమయంలో పలు భయాలతో ఆందోళనలు చేస్తే వారిపై అక్రమ కేసులు బనాయించారని, అప్పట్లో 131 మందిపై పెట్టిన కేసులు ఉపసంహరిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఇందుకు జీవో నంబరు 321 ఈ రోజే విడుదల చేస్తున్నామన్నారు. అనపర్తి, బిక్కవోలు మండలాల్లో ఇళ్ల పట్టాల పంపిణీని 3 నెలల్లో పూర్తిచేస్తామని వివరించారు.

స్థానిక యువతకు కొలువులివ్వాలి: ఎమ్మెల్యే
గ్రాసిం పరిశ్రమ ద్వారా 75% ఉద్యోగాలు స్థానిక యువతకే ఇవ్వాలనీ.. గోదావరి కెనాల్‌ రహదారిని బలోపేతం చేయాలని ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి కోరారు. కార్యక్రమంలో మంత్రులు వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, గుడివాడ అమర్‌నాథ్‌, దాడిశెట్టి రాజా, పినిపే విశ్వరూప్‌, ఎంపీలు మార్గాని భరత్‌, వంగా గీత, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, ఎమ్మెల్యేలు కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, జక్కంపూడి రాజా, తలారి వెంకటరావు, జి.శ్రీనివాసనాయుడు, పొన్నాడ సతీష్‌, పెండెం దొరబాబు, రాపాక వరప్రసాద్‌, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, కలెక్టర్‌ కె.మాధవీలత, డీఐజీ పాలరాజు, ఎస్పీలు ఐశ్వర్యరస్తోగి, రవీంద్రనాథ్‌బాబు, జేసీ శ్రీధర్‌, పరిశ్రమల శాఖ కమిషనర్‌ జి.సృజన తదితరులు పాల్గొన్నారు.

పదివేల మందికి ఉపాధి

‘గోదావరి పరీవాహక ప్రాంతంలో పరిశ్రమను ఏర్పాటు చేయటం ఆనందంగా ఉంది. దీనిని చారిత్రక ఘట్టంగా భావిస్తున్నాం. కాస్టిక్‌ సోడా పరిశ్రమ ఏర్పాటు మా వ్యాపార విస్తరణలో ఓ మైలురాయి. రాష్ట్రంలో మా సంస్థకు ఆరు రకాల వ్యాపారాలు ఉన్నాయి. రాష్ట్రంలో 105 స్టోర్లు పనిచేస్తున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేలమందికి ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తున్నాం. ఇప్పుడు ప్రారంభిస్తున్న ఈ పరిశ్రమ దేశంలో ఎనిమిదోది. తద్వారా ఏడాదికి 1.5 లక్షల టన్నుల ఉత్పత్తి జరగనుంది’ అని ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార మంగళం బిర్లా చెప్పారు.

ఇదీ చదవండి: రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం... ఎందుకంటే..?

Last Updated : Apr 22, 2022, 3:55 AM IST

ABOUT THE AUTHOR

...view details