గోదావరి ఉగ్రరూపం తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు శాపంగా మారింది. మరీ ముఖ్యంగా దేవీపట్నం ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. పోలవరం ఎగువ గ్రామాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. నెల రోజుల వ్యవధిలో 4సార్లు గ్రామాల్లోకి నీరు వచ్చిందని... 2 సార్లు పూర్తిగా ముంచెత్తిదంటూ వాపోతున్నారు.
పడవల ద్వారా ప్రయాణం...
వరద ముంపుతో సుమారు 30 గ్రామాలకు విద్యుత్ సరఫరా ఆగింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పడవల ద్వారా రాకపోకలు సాగుతున్నాయని.. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ సమస్యను ఎప్పటికి పరిష్కరిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తొయ్యేరు, దేవీపట్నం, వీరవరం, పూడిపల్లి, పోశమ్మగండి వద్ద ప్రభుత్వం సహాయ శిబిరాలు ఏర్పాటుచేసినా సౌకర్యాల్లేవని ముంపు ప్రాంతాల బాధితులు వాపోతున్నారు.
ఆకలికి అలమటిస్తున్నాం....
సహాయ సిబ్బంది అందించే ఆహార పొట్లాలు సరిపోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలు లేక పిల్లలు అలమటిస్తున్నా... అధికారుల నుంచి కనీస స్పందన లేదంటున్నారు.
గోదావరి ఉద్ధృతి...జలదిగ్బంధంలోనే లోతట్టు ప్రాంతాలు - east godavari
తూర్పుగోదావరి జిల్లాను గోదావరి ముప్పు తిప్పలు పెడుతోంది. ఐదారు రోజులు నుంచి దేవీపట్నం మండలం ముంపులోనే ఉంది. వరదనీటిలో పల్లెలు నానుతున్నాయి. ఆహారం, తాగునీటికి కటకటగా ఉంది. కోనసీమ వాసులనూ వరద కష్టాలు వెంటాడుతున్నాయి. నీటిపాలైన పంటలను చూసిన రైతులు బోరున విలపిస్తున్నారు.
పంటలకు తీరని నష్టం....
కోనసీమలో 12 మండలాలు వరద ప్రభావానికి గురయ్యాయి. వెదురుబీడెం, అప్పనపల్లి, జి.పెదపూడిలంక, కనకాయలంక కాజ్‌వేలపై వరదనీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పి.గన్నవరం మండలం కె.ఏనుగులపల్లి, శివాయలంక గ్రామాలకు రాకపోకలకు నిలిచిపోయాయి. ముమ్మిడివరం మండలంలోని సుమారు 2 వేల మంది బాధితులు పునరావాస కేంద్రాల్లో ఉన్నారు. గౌతమి, గోదావరి ఉద్ధృతితో చాలా ప్రాంతాల్లో భూములు కోతకు గురవుతున్నాయి. మిరప, పత్తి, వరి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
తాత్కాలికం వద్దు...
సీతానగరం సమీపంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు కన్నబాబు, ఆళ్ల నాని, పినిపె విశ్వరూప్, తానేటి వనిత పర్యటించారు. స్థానికంగా వంతెన నిర్మాణానికి 35కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు ఆళ్ల నాని ప్రకటించారు. ప్రతిసారి ఇలా తాత్కాలిక ఏర్పాట్లకు బదులు... శాశ్వత పునరావాసం కల్పిస్తే ఇక్కడి నుంచి వెళ్లిపోతామని బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చూడండి-జల దిగ్బంధంలో 30గ్రామాలు, ఇంకా చేరుకోని అధికారులు