శాంతించినట్లే కనిపించిన గోదావరి....మళ్లీ పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. గురువారం రాత్రి 11 గంటల సమయానికి 52.9 అడుగులుగా ఉన్న నీటిమట్టం ఉదయం 6 గంటలకు 54 అడుగులకు పెరిగింది. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.. మరోవైపు.. ధవళేశ్వరం వద్ద కూడా నీటమట్టం పెరుగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అధికారులు అంచనా వేస్తున్నారు. కాటన్ బ్యారేజీలో ప్రస్తుతం సముద్రంలోకి 14 లక్షల క్యూసెక్కులకు పైగా వదులుతున్నారు. సీలేరు నదిలోని డొంకరాయి డ్యామ్ నుంచి 18వేల క్యూసెక్కుల నీరు వదలడం, ఛత్తీస్‌ఘడ్‌లో వర్షాల కారణంగా వరద మళ్లీ పెరిగింది. గోదావరికి ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందని...కేంద్ర జలసంఘం అధికారులు అంచనా వేస్తున్నారు.
గోదావరిని వదలని వరద.. ఇంకా జలజీవనంలోనే బాధితులు తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి వరద 26 మండలాల్లోని 173 గ్రామాలపై ప్రభావం చూపింది. 82 గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. మన్యంలోని చింతూరు, ఎటపాక, వీఆర్‌పురం, కూనవరం, దేవీపట్నం మండలాలు వరద ముంపునకు గురయ్యాయి.
57 గ్రామాలకూ ముంపు ముప్పు వీడలేదు. చాలా మంది గిరిజనులు ఇంకా కొండలపైనే తలదాచుకుంటున్నారు. సరైన ఆహారం, నీరు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. దేవీపట్నం మండలంలో 8 రోజులుగా జలదిగ్బంధంలోనే ఉన్న 36 గ్రామాలు మరోసారి వరద పెరగడంతో బిక్కుబిక్కుమంటున్నాయి. చింతూరులో వరద బాధితులకు సరకులు ఇచ్చి తిరిగివస్తుండగా శబరి వంతెన పిల్లర్‌ను ఢీకొని లాంచీ రెండు ముక్కలైంది. ఒక భాగం కొట్టుకుపోగా మరో భాగం తిరగబడింది. లాంచీలోని నలుగురు నదిలో పడిపోయారు. వేరే పడవ సిబ్బంది వీరిలో ముగ్గురిని కాపాడారు. ఒకరు గల్లంతయ్యారు. ఒడ్డుకు చేరిన బాధితులను ఆసుపత్రికి తరలించారు.
తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా వరదలకు 87 వేల 812 మంది ప్రభావితమైనట్లు అధికారులు గుర్తించారు. 124 పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి 45,410 మందిని తరలించినట్లు వెల్లడించారు. జిల్లాలోని 1902.30 హెక్టార్లలో వరి, 8,922.10 హెక్టార్లలో ఉద్యాన పంటలు నీట మునిగాయి. 95 గృహాలు దెబ్బతినగా, మరో 26,851 గృహాలు నీట మునిగాయి. ఇప్పటివరకూ ఒకరు మృతి చెందగా, గల్లంతైన మరొకరి ఆచూకీ లభ్యం కాలేదు. మృతి చెందిన మూగజీవాల సంఖ్య 258కు పెరిగింది. సీతానగరం మండలంలోని ములకల్లంక ఇంకా వరద నీటిలోనే నానుతోంది. రాజమహేంద్రవరంలోని లోతట్టు ప్రాంతాలపైనా వరద ప్రభావం చూపుతోంది.
కోనసీమ లంక గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. చాలా ఇళ్లను వరద నీరు ముంచెత్తింది. బాధితులు నిత్యావసరాలకు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోన లంక గ్రామాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. వరదల వల్ల నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుని పరిహారం అందిస్తామని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. బాధితులకు సొంత ఖర్చులతో ఆహార పొట్లాలు, మజ్జిగ, పాలు, వాటర్ ప్యాకెట్లు అందించారు. వరద ముంపునకు గురైన లంక గ్రామాల ప్రజలను ప్రభుత్వ పరంగా అన్నివిధాలా ఆదుకుంటామని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి అన్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో ముంపు బారినపడిన లంక గ్రామాలను ఆయన సందర్శించి బాధితులను పరామర్శించారు. విద్యుత్, తాగునీరు, రైతులు పశుగ్రాసం అందజేయాలని బాధితులు కలెక్టర్‌ను కోరారు. వరద కారణంగా జిల్లాలో 140 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వరద తగ్గిన వెంటనే విద్యుత్ పునరుద్ధరణ చర్యలతోపాటు పారిశుద్ధ్యం, పంట నష్టం అంచనాలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ అనుపమ....ఆలమూరు మండలం బడుగువాని లంకలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు.
పోలవరం ముంపు మండలాలకు వరద సమాచారం ఇవ్వలేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఏడుమండలాల్లో ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలియనివ్వడం లేదని మండిపడ్డారు. నిర్వాసితులను ముందే ఎందుకు సురక్షిత ప్రాంతాలకు తరలించలేదని నిలదీశారు.
ఇదీ చదవండి:ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ 27కు వాయిదా