ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తూర్పుగోదావరి జిల్లాలో తొలిదశ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు

పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని పలు మండలాల్లో అధికారులు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎన్నికల కోడ్​ అమలు సరిగా లేదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

panchayat elections
పంచాయతీ ఎన్నికలు

By

Published : Feb 4, 2021, 6:00 PM IST

ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తరువాత రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు తీసివేయటం, గోడలపై ఉన్న కాగితాలను అధికారులు తొలగిస్తుంటారు. గ్రామాల్లో హడావిడిగా చేసే అధికారులు వారి కార్యాలయాల వద్ద ఉన్న వాటిని పట్టించుకోకపోవడమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద రేషన్ సరుకులు సరఫరా చేసే వాహనాలు ఉన్నాయి. ఈ వాహనాలపై రాజకీయ నాయకుల ఫొటోలు, సంక్షేమ పథకాల చిత్రాలు ఉన్నాయి.

అదే ప్రాంతంలో విద్యాశాఖ, మండల పరిషత్ వంటి కార్యాలయాలున్నాయి. నిత్యం ఎంతో మంది ప్రజలు కార్యాలయానికి వస్తుంటారు. గ్రామాల్లో అమలు చేసే నిబంధనలు ఇక్కడ అమలు కావా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల కోడ్​ అమలు చేయాల్సిన అధికారులే వారి కార్యాలయ పరిసరాల్లో వాటిని ఉల్లఘించటాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.

అమలాపురంలో

స్థానిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అందరూ కృషి చేయాలని జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల పరిశీలన ప్రత్యేక అధికారి సీహెచ్ అరుణ్ కుమార్ తెలిపారు. అమలాపురం డివిజన్​లోని ఎన్నికల అధికారులు, సిబ్బందితో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల విధి నిర్వహణలో అలసత్వం వహించకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్, డీఎస్పీ వై.మాధవరెడ్డి, డివిజనల్ పంచాయతీ అధికారి తదితరులు పాల్గొన్నారు.

అనపర్తిలో...

జిల్లాలోని అనపర్తి, బిక్కవోలు మండలాల్లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అనపర్తి సీఐ భాస్కరరావుతో కలిసి అడిషనల్ ఎస్పీ కరణం కుమార్ పరిశీలించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు. సమస్యలు సృష్టించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో నమోదైన కేసులతో దీర్ఘకాలం ఇబ్బంది పడాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

జగ్గంపేటలో..

మండలంలోని గొల్లలగుంట గ్రామ సర్పంచ్ అభ్యర్థినిగా నామినేషన్ వేసిన సబ్బెళ్ల పుష్పావతి భర్త శ్రీనివాస రెడ్డి ఇటీవల మరణించాడు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆర్డీవో ఎస్.మల్లిబాబు, పెద్దాపురం డీఎస్పీ ఏ. శ్రీనివాసరావు మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆర్డీవో ఎస్.మల్లిబాబు పాత్రికేయులతో మాట్లాడారు. సర్పంచ్​ అభ్యర్థి భర్త మృతి చెందటంతో తొలిదశలోనే ఎన్నికలు నిర్వహించాలా?లేదా తదుపరి దశలకు వాయిదా వేయలా? అని ఆమెను అడిగినట్లు చెప్పారు.

అభ్యర్థిని కుటుంబసభ్యులు చర్చించుకున్న తర్వాత మొదటి దశ ఎన్నికలోనే పోటీ చేయడానికి అంగీకారం తెలిపారని మల్లిబాబు చెప్పారు. ఎన్నికల ప్రచారానికి కావలిసిన భద్రతా చర్యలు ఎన్నికల సంఘం తరపున ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎన్నికలు జరిగే రోజు ఈ గ్రామాన్ని సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించి.. అదనపు పోలీసు బలగాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల పరిశీలకులుగా ఇతర డివిజన్​లకు చెందిన తహసీల్దార్ స్థాయి అధికారులను జిల్లా కలెక్టర్ నియమిస్తారని తెలిపారు.

ఇదీ చదవండి:పల్లె పోరు: నేటితో ముగియనున్న రెండో దశ నామినేషన్ల స్వీకరణ

ABOUT THE AUTHOR

...view details