తూర్పు గోదావరి జిల్లా మండపేట దాసిరెడ్డి వారి వీధిలో జరిగిన అగ్ని ప్రమాదంలో సెల్ టవర్లు అగ్నికి ఆహుతయ్యాయి. టవర్లోని కేబుల్స్ కారణంగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. జనావాస ప్రాంతంలోని ఓ భవనం పై అంతస్తులో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆ భవనంలో నివసించే వారు, చుట్టు పక్కల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. షార్ట్ షార్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
అగ్నిమాపక అధికారులు సకాలంలో అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేశారు. అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సంఘటన స్థలాన్ని మండపేట మున్సిపల్ ఛైర్మన్ పతివాడ రాణి, కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ పరిశీలించారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించని కారణంగానే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నామని కమిషనర్ తెలిపారు. ఇక్కడ సెల్ టవర్ ఏర్పాట్లపై అనుమతులు ఉన్నాయా లేదా అనే అంశంపై విచారణ చేస్తున్నామన్నారు. సరైన నిర్వహణ సాగించని కారణంగా సెల్ టవర్ నిర్వాహకులపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. టౌన్ సీఐ అడపా నాగమురళి ఇతర సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు.