వక్ఫ్ భూముల వేలంపై రైతుల ఆందోళన - అమలాపురంలో వక్ఫ్ భూములు వేలం తాజా వార్తలు
తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో వక్ఫ్ భూముల వేలాన్ని రైతులు అడ్డుకున్నారు. ఎన్నో ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్న భూములను ఎలా వేలం వేస్తారంటూ తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. అయితే నిబంధనల మేరకే తాము చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు.
వక్ఫ్ భూములను సంవత్సరాల తరబడి సాగు చేసుకోని జీవిస్తున్నామని.. అలాంటి భూములను వేలం వేయడం దారుణమని తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో రైతులు ఆందోళనకు దిగారు. మండల పరిధిలోని 18 ఎకరాల భూములను కౌలుకు ఇచ్చేందుకు గాను బహిరంగ వేలం నిర్వహించేందుకు.. తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాట్లు చేశారు. దీంతో విషయం తెలుసుకున్న రైతులు తహసీల్దార్ కార్యాలయం లోపలకు చొచ్చుకు వెళ్లి వేలం నిర్వహించడం తగదని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మండలంలో సుమారు 100 ఎకరాలకు పైబడి వక్ఫ్ భూములున్నాయి. అనేక సంవత్సరాలుగా తాము సాగు చేసుకుంటున్న భూములకు బహిరంగ వేలం పెట్టడం ఎంత మాత్రం సమంజసం కాదని వాపోయారు. నిబంధనల మేరకు తాము చర్యలు తీసుకున్నామని అధికారులు వివరించారు. పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పి అక్కడినుంచి పంపించి వేశారు.