తూర్పుగోదావరి జిల్లా తాళ్ళరేవు, ఐ.పోలవరం, ముమ్మడివరం, కాట్రేనికోన మండలాలలో సుమారు ఐదు వేల హెక్టార్ల వరి సాగవుతుంది. అందులో కౌలు రైతులే ఎక్కువ. తొలకరి పంట పూర్తిగా నష్టపోవడంతో రెండో పంట వేసేందుకు కౌలురైతులు వెనుకాడుతున్నారు. కౌలుకు తీసుకున్న చేలల్లో ఎటువంటి పనులు చేపట్టకుండా వదిలేశారు. సొంతంగా సాగు చేసుకుంటున్న వాళ్లు మాత్రం పొలాల్ని చదును చేసి, వెదజల్లు పద్ధతిలో విత్తునాట్లు వేశారు. ఇన్ని వర్షాలు పడినా కాలువ చివరి భూములకు ఇప్పుడు కూడా నీరు అందడం లేదు. ఇక పంట వేసిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని బెంబేలెత్తుతున్నారు. దాంతో ఈ నెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో నాట్లుపడే పరిస్థితి కనిపించడం లేదు.
రైతుల్లో తగ్గని హైరానా.. నెలాఖరుకు నాట్లు పడేనా! - తూర్పుగోదావరి జిల్లా కౌలు రైతుల కష్టాలు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల వల్ల రానున్న మార్చిలో కాలువలు మూసివేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అందుకే డిసెంబర్ నెలాఖరుకి నాట్లు పూర్తి చేయాలని రైతులను గత నెలలోనే హెచ్చరించింది. కానీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నివర్ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు పడ్డాయి. కోతకొచ్చిన వరి చేలన్నీ నెలపాటు నీటిలో మునిగాయి. దాంతో చాలా మంది రైతులు కోత కోయలేదు. ఒక్క బస్తా ధాన్యం కూడా వారి చేతికి అందలేదు. చేసిన అప్పులు తీరక, ఖరీఫ్‌కు కొత్త రుణాలు పుట్టక అయోమయంలో పడ్డారు.
రైతుల్లో తగ్గని హైరానా