ఒకప్పుడు వసతులు లేని ఆ పాఠశాల ఇప్పుడు అన్ని సౌకర్యాలతో అందుబాటులోకి వచ్చింది. నేడు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా బదులిస్తూ.. తూర్పు గోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరి ప్రాథమిక పాఠశాల నిలిచింది. నాడు నేడు పనుల్లో భాగంగా.. ప్రధానోపాద్యాయుడు ప్రవీణ్‌కుమార్ కృషితో ఈ పాఠశాలను అభివృద్ధి చేశారు.
ఆదర్శంగా నిలుస్తున్న కొమరగిరి ప్రాథమిక పాఠశాల - aadarsha school news
ఆ పాఠశాలకు వెళితే గోడలపై ఉన్న చక్కటి బొమ్మలు ఆకట్టుకుంటాయి. స్వాగతం అంటూ గేటుపై రాసి ఉన్న ఆ రాతలు లోపలికి రమ్మని ఆహ్వానిస్తాయి. అందులో అడుగు పెట్టగానే పరిశుభ్రత పలకరిస్తుంది. ఇదంతా ఏదైనా కార్పొరేట్ పాఠశాలల్లో అనుకుంటే పొరపాటే. తూర్పు గోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరి ప్రాథమిక పాఠశాలను తీర్చిదిద్దిన తీరు విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
విద్యార్థులను ఆకట్టుకునేలా స్కూల్ ప్రహరీ గోడలపై బొమ్మలు వేయించారు. ప్రధాన గేటుపై స్వాగతం, సుస్వాగతం బోర్డులు, పచ్చదనం పరిశుభ్రత, క్రీడా ప్రాంగాణం.. ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. స్కూల్ ఆవరణంలో ఏర్పాటు చేసిన 'ఐ లవ్ మై స్కూల్' అనే బోర్డును ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. అలాగే పరిశుభ్రమైన మరుగుదొడ్లు, కొళాయిలు తదితర సౌకర్యాలతో విద్యార్థులను ఆహ్వానించేలా నిర్మించారు. అధ్వానంగా ఉన్న పాఠశాలను ఈ విధంగా తీర్చి దిద్దడంలో ప్రధానోపాధ్యాయుల కృషి ఎంతోగానో ఉందని ఆ పాఠశాల విద్యార్థులు, గ్రామస్థులు పేర్కొన్నారు.