గర్భిణులను వేధిస్తున్న రక్తహీనత సమస్య... ఆగని శిశు మరణాలు - గర్భిణుల సమస్యలు
నవమాసాలు శిశువును కడుపులో మోసి.. ప్రసవానికి ఆసుపత్రికి వెళ్లిన అమ్మ చిన్నబోతోంది.. రక్తహీనత కారణంగా పుట్టిన బిడ్డ ప్రాణం నిలవకపోవడంతో ఆమె హృదయం తల్లడిల్లుతోంది. ఇది ఎక్కడో మారుమూల పల్లెల్లో ఉన్న సమస్య కాదు. నగరాల నుంచి అన్నిచోట్లా ఉంది. సాక్షాత్తూ తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలోని ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి(జీజీహెచ్)లో ఏటా నమోదవుతున్న మాతృ, శిశు మరణాలే అందుకు నిదర్శనం.
రక్తహీనత సమస్య
By
Published : Aug 9, 2021, 10:53 AM IST
తూర్పుగోదావరి జిల్లాలో గర్భిణులను రక్తహీనత సమస్య వేధిస్తోంది. రక్తహీనత కారణంగా పుట్టిన బిడ్డ ప్రాణం నిలవకపోవడంతో ఆమె హృదయం తల్లడిల్లుతోంది. మారుమూల పల్లెల నుంచి నగరాల వరకు అన్ని చోట్ల ఈ సమస్య వేధిస్తుంది. అందుకు ఏటా నమోదవుతున్న మాతృ, శిశు మరణాలే అందుకు నిదర్శనం.
వివిధ కారణాలతో..
జిల్లాలోని వివిధ ప్రాంతాలతోపాటు ఇతర జిల్లాల నుంచి కూడా గర్భిణులు, నవజాత శిశువులు చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు వస్తారు. గర్భిణుల్లో పోషకాహార లోపం, రక్తహీనత కారణంగా మతాశిశు మరణాలు సంభవిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. నెలలు నిండకుండానే కాన్పు అవ్వడం, కడుపులోనే బిడ్డ చనిపోవడం, తక్కువ బరువుతో పుట్టడం తదితర కారణాలతో శిశు మరణాలు చోటు చేసుకుంటున్నాయి. సరైన సమయంలో వైద్యం అందక మరికొందరు ప్రాణాలు వదులుతున్నారు.
ఏజెన్సీలో ఆగడం లేదు..
ఏజెన్సీ ప్రాంతంలో పోషకాహారం, పూర్తిస్థాయిలో వైద్యం అందక మాతా శిశు మరణాలు సంభవిస్తున్నాయి. రంపచోడవరం ఐటీడీఏ పరిధి ఏడు మండలాల్లో 18 పీహెచ్‌సీలు, రెండు సీహెచ్‌సీలు, ఒక ఏరియా ఆసుపత్రి ఉన్నాయి. గడచిన రెండేళ్లలో ఇక్కడ 61 శిశు, 16 మాతామరణాలు చోటు చేసుకున్నాయి. ఆసుపత్రులకు వెళ్లి వైద్య సేవలు పొందకుండా మూఢ నమ్మకాలతో నాటు వైద్యం తీసుకుంటూ పరిస్థితి విషమించి మృత్యువాత పడుతున్నట్టు వైద్యాధికారులు చెబుతున్నారు. దీనికితోడు ఏజెన్సీలో వైద్యుల కొరత కూడా పీడిస్తోంది.
పోషకాహారం అందకే..
ఏజెన్సీలో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, పిల్లలకు పోషకాహారం అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేమితో పోషకాహారం సక్రమంగా అందడంలేదు. అంగన్‌వాడీల్లో గర్భిణులతో పాటు అప్పుడే పుట్టిన వారి నుంచి అయిదేళ్ల వయసు కలిగిన పిల్లలందరికీ ప్రతిరోజు పాలు, గుడ్డుతో పాటు పప్పు, ఆకుకూరతో భోజనం అందించాలి. వేరుశెనగ అచ్చులు, అరటి పండు ఇవ్వాలి. కరోనా నేపథ్యంతో రెండేళ్లుగా అంగన్‌వాడీలు మూతపడడంతో పూర్తిస్థాయిలో ఈ సేవలు అందలేదు. రాజవొమ్మంగి, గంగవరం, వై.రామవరం మండలాల్లో అధికంగా మాతా, శిశు మరణాలు చోటు చేసుకొన్నాయి.
కరోనా పరిస్థితుల్లో..
గర్భిణుల ఆరోగ్యంపై గతేడాది నుంచి కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతోంది. వారి ఆరోగ్యంపై శ్రద్ధ చూపాల్సిన వైద్యాధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది కరోనా విధుల్లో తలమునకలయ్యారు. ఈ దశలో వైద్య సూచనలు చెప్పేవారు లేక పరిస్థితి మరికొంత క్షీణించింది. ప్రస్తుతం జిల్లాలో సుమారు 68 వేల మంది గర్భిణులుండగా.. వారిలో 11 శాతం కంటే తక్కువ హిమోగ్లోబిన్ ఉన్నవారు 49,583 మంది, ఏడు శాతం కంటే తక్కువ ఉన్నవారు 890 మంది ఉన్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మిగతా జిల్లాలతో పోలిస్తే తూర్పులో మాతాశిశు మరణాల రేటు ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
విషమించిన తరువాత..
గర్భిణులు రక్తహీనత, రక్తపోటు, గుర్రపువాతం, అధిక రక్తస్రావం, కిడ్నీలు దెబ్బతినడం కారణాలతో మృతి చెందుతున్నారు. హిమోగ్లోబిన్ 10.5 కంటే తక్కువగా ఉంటే రక్తహీనతగా గుర్తిస్తారు. ఈ సమస్యతో పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం, కడుపులోనే మరణించడం సంభవిస్తాయి. పరిస్థితి విషమించిన తరువాత జీజీహెచ్‌కు రావడంతో మరణాలు అధికంగా ఉంటున్నాయి. - డా.లావణ్యకుమారి, జీజీహెచ్ గైనిక్ హెచ్‌వోడీ
వారం వయసు గల తక్కువ బరువున్న నవజాత శిశువును గత నెలలో రాజమహేంద్రవరంలో అట్టపెట్టెలో వదిలి వెళ్లిపోయారు. ఆ శిశువును జీజీహెచ్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
గత నెలలో మండపేటకు చెందిన ఓ గర్భిణి ఇద్దరు ఆడ శిశువులకు జన్మనిచ్చింది. తరువాత అధిక రక్తస్రావం కారణంగా ఆమె చనిపోయింది.
రాజవొమ్మంగి మండలం గొబ్బిల మడుగుకు చెందిన ఈశ్వరమ్మకు జన్మించిన నాలుగు నెలల శిశువు రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో మే 3న మృతి చెందింది. అస్వస్థతకు గురైన శిశువును ఆసుపత్రికి తరలించగా.. రెండు రోజుల అనంతరం మృతిచెందింది.
రాజవొమ్మంగి మండలం లాగరాయిలో రెండు నెలల వయసున్న ఆడ శిశువు ఏప్రిల్ 17న మృతి చెందింది. అస్వస్థతకు గురైన శిశువును రాజవొమ్మంగి పీహెచ్‌సీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లి అస్వస్థతకు గురై ఉంటుందని అక్కడ చెప్పారు.