కరోనా.. కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. ఆనందంగా సాగే జీవితాలలో తీరని విషాదాన్ని నింపుతోంది. రెండు వారాల వ్యవధిలోనే ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందిన ఘటన అందరినీ కలిచివేస్తోంది. తూర్పు గోదావరి జిల్లా రావులపాలేనికి చెందిన ఒక కుటుంబంలో ఐదుగురు కరోనాతో మృతిచెందగా, ఒకరు క్యాన్సర్ తో మరణించారు. తొమ్మిది మంది మగవారు, ఒక ఆడ సంతానం ఉన్న కుటుంబం రావులపాలెంలో నివసిస్తోంది. ఇందులో మొదటి సంతానమైన మహిళ (77) కొన్నేళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతూ జులై 26వ తేదీన మృతి చెందారు.
ఈ విషాదం మరవక ముందే ఆమె మొదటి, మూడవ తమ్ముళ్ల కుటుంబాలకు చెందిన ఐదుగురుకి కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మొదటి తమ్ముడు(75) ఆగస్ట్ 6న, ఆయన కుమారుడు(52) జులై 8న మృతి చెందగా, మూడో తమ్ముడు భార్య (63) ఆగస్టు 5న, కొడుకు (42) జులై 30న, మనవడు(17) ఆగస్ట్ 6న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతూ మరణించారు. రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందడం కలిచివేసింది.