ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అభివృద్ధి పనులకు బ్రేక్.. రైతుల్లో ఆందోళన

గోదావరి డెల్టా రైతాంగానికి కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. వ్యవసాయానికి కీలకమైన పంట కాల్వలు, లాకుల అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. గతేడాది అరకొర పనులు జరిగినా..ఈ ఏడాది మాత్రం పూర్తిగా ఆపేశారు. పనులు చేపట్టకపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

అభివృద్ధి పనులకు బ్రేక్..ఆందోళనలో గోదావరి డెల్టా రైతులు

By

Published : May 9, 2019, 10:02 AM IST

లాకుల అభివృద్ధి పనులకు బ్రేక్..ఆందోళనలో గోదావరి డెల్టా రైతులు

గోదావరి డెల్టా రైతాంగానికి కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. వ్యవసాయానికి కీలకమైన పంట కాల్వలు, లాకుల అభివృద్ధి పనులకు బ్రేక్ పడింది. గత ఏడాది నీరు చెట్టు పథకం కింద కొంత మేర పనులు పూర్తి కాగా.. ఈ ఏడాది మిగిలిన పనులు పూర్తి చేయడం లేదు. ఈ పరిస్థితే.. డెల్టా రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. కోనసీమకు నీరందించే మధ్య డెల్టాలో పరిస్థితి మరింత దయనీయంగా మారింది.

తాత్కాలిక పనులూ లేవు..
తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని మధ్య డెల్టాలో కీలకమైన లొల్ల లాకులు శిథిలావస్థకు చేరుకున్నాయి. నీరు-చెట్టు పథకం కింద గతేడాది 6 కోట్ల 13 లక్షల రూపాయల విలువైన 81 పనులు మంజూరయ్యాయి. వాటిలో 2 కోట్ల 37 లక్షల రూపాయలతో 27 పనులు చేశారు. మిగిలిన పనులు ఈ సంవత్సరం చేయొద్దని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ సంవత్సరం నుంచి తాత్కాలిక పనులూ నిలిచిపోయాయి. కట్టడాలు పూర్తిగా ఛిద్రమయ్యాయి. ఏ సమయాన కూలిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. తలుపులు, గోడలకు రంధ్రాలు ఏర్పడ్డాయి. సాగునీటి సరఫరా సమయంలో జలవనరుల శాఖ సిబ్బందికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

పనులు చేపడతాం..
జల రవాణాకు కీలకంగా ఉన్న లాకు ఛాంబర్‌ ఉనికి కోల్పోతోంది. పడవలు, లాంచీలు రాకపోకలు సాగించేందుకు ఉద్దేశించిన ఛాంబర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. జలమార్గంలో ఇసుక మేటలు వేసి రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. ఈ సమస్యపై స్పందించిన జలవనరుల శాఖ అధికారులు... బ్యాంక్ కెనాల్ పనులు ఎలాగైనా చేపడతామని.... వచ్చే ఏడాది పూర్తి స్థాయిలో నిర్వహిస్తామన్నారు.

చిన్న చిన్న పనులకూ కాంట్రాక్టర్లు ముందుకు రాని కారణంగా.. గోదావరి డెల్టాలో మిగతా ఆధునికీకరణ పనులు జరగడం ఈ ఏడాది కష్టంగా మారింది. అత్యవసరమైన పనులు చేపట్టి పంటలకు సకాలంలో నీరు అందేలా చూడాలని గోదావరి డెల్టా రైతులు వేడుకొంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details