ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉప్పు సత్యాగ్రహ ఆనవాళ్లు... నేడు ఆక్రమణల పాలు

బ్రిటీష్ వారి మీద పోరులో మహాత్ముడు చేసిన ఉప్పు సత్యాగ్రహం చరిత్రలో ప్రత్యేకం. భారతీయులపై ఆంగ్లేయుల దౌర్జన్యాలను ఆపడానికి బాపూజీ ప్రయోగించిన అస్త్రం.. ఆ పోరాటం. అంతటి ప్రత్యేకత కలిగిన ఆ ఉద్యమ సమయంలో ఉప్పు పండించిన భూములు కొన్ని చోట్ల ఆక్రమణలకు గురవుతున్నాయి.

ఉప్పు సత్యాగ్రహ సమయంలో గాంధీ

By

Published : May 10, 2019, 9:03 AM IST

ఉప్పు పేరుతో తప్పులు

దండి యాత్ర సమయంలో దేశవ్యాప్తంగా ఉప్పు పండించిన ప్రాంతాలన్నింటినీ స్వాతంత్య్రం అనంతరం కేంద్రం గుర్తించింది. ప్రస్తుతం ఆ భూముల్లో కేంద్ర లవణ పరిశ్రమ విభాగం ఆధ్వర్యంలో తీర ప్రాంత ప్రజలు చాలా చోట్ల ఉప్పు సాగు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఎందుకూ పనికి రాకుండా ఖాళీగా పడి ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలో 1500 ఎకరాల కేంద్ర ప్రభుత్వ భూములు ఈ కోవలోకే వస్తాయి.

కరప మండలంలోని గురజనాపల్లి, పెనుగుదురులోని 750ఎకరాలతోపాటు తాళ్లరేవు మండలం చొల్లంగి, కాకినాడ నగరం సమీపంలోని ఏటిమొగ, జగన్నాథపురంలోనూ ఉప్పు సాగవుతోంది. 120మంది లీజుదారుల ఆధీనంలో 900ఎకరాల భూమి ఉండగా మరో 600ఎకరాలు నిరుపయోగంగా మారింది. ఎకరా భూమికి 2వేల 600 రూపాయల లీజు ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు.

ఉప్పు సాగు పేరుతో రొయ్యల సాగు

పైకి అంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ...అసలు లొసుగు మాత్రం ఇక్కడే ఉంది. కాకినాడ సమీప ప్రాంతాల్లో ఉప్పసాగు కోసం తీసుకున్న భూముల్లో సుమారు 80ఎకరాల్లో అక్రమంగా రొయ్యల సాగు జరుగుతోంది. ఉప్పు సాగు కోసం భూములు లీజుకు తీసుకున్నవారికి 40వేల నుంచి లక్ష రూపాయల వరకూ ముట్టచెప్పి ఆ భూముల్లో కొందరు వ్యక్తులు రొయ్యల సాగు చేసుకుంటున్నారు. అయితే ఆ భూములు తమకు కౌలుకిస్తే వ్యవసాయం చేసుకుంటామని రైతులు కోరుతున్నారు. లవణ పరిశ్రమ విభాగంలో ఉద్యోగుల కొరతతో ఉప్పు సాగు పేరుతో రొయ్యల సాగు చేస్తున్నా గుర్తించలేకపోతున్నారు. ముప్పై ఎకరాల్లో మాత్రమే రొయ్యల సాగు జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో అక్రమాలను గుర్తించి కొంతమంది లీజులు రద్దు చేయించామంటున్నారు.

అధికారులు కఠినంగా వ్యవహరిస్తే తప్ప ప్రభుత్వ భూముల పరిరక్షణ సాధ్యం కాదని స్థానికులు చెబుతున్నారు. అక్రమంగా రొయ్యల సాగు చేస్తున్న భూములను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details