ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ నగరాలకు ఏమైంది! - తూర్పుగోదావరి జిల్లా వార్తలు

కరోనా కోరలు చాస్తోంది.. కరాళ నృత్యం చేస్తోంది. జిల్లాలోని 64 మండలాలనూ మహమ్మారి చుట్టేసింది. నగరాలు, పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా జిల్లా మొత్తాన్ని వణికిస్తోంది. ప్రధానంగా వైరస్‌ తీవ్రత జిల్లా కేంద్రం కాకినాడతోపాటు.. జిల్లాలో మరో ప్రధాన నగరం రాజమహేంద్రవరంలలోనూ ఎక్కువగా ఉంది. ఈ రెండు నగరాలకు అనుబంధంగా ఉన్న గ్రామీణ మండలాలతోపాటు జిల్లావ్యాప్తంగా నిత్యం నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు కలవర పరుస్తున్నాయి. ఓవైపు యంత్రాంగం కరోనా కట్టడికి కసరత్తు చేస్తున్నా.. కొందరి నిర్లక్ష్యం వైరస్‌ వ్యాప్తికి కారణమవుతోంది.

corona cases
corona cases

By

Published : Aug 13, 2020, 8:11 AM IST

కాకినాడలో కలకలం..

తూర్పుగోదావరి జిల్లా కేంద్రం, కాకినాడ నగరంలో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. ఇక్కడ నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 5,069కి చేరింది. నగరంలో ఆరు, 10, 11, 12, 13, 21, 22, 23, 24, 25, 35 డివిజన్లలో కేసుల సంఖ్య వంద దాటేసింది. నగరంలో 50 వార్డులుంటే.. ఎనిమిది వార్డులు మినహా మిగిలిన అన్నిచోట్లా కేసుల జాడ కనిపిస్తోంది.

వ్యాప్తికి కారణమిదే..

జిల్లా కేంద్రం కాకినాడకు నిత్యం జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వస్తుంటారు. లాక్‌డౌన్‌లో పరిస్థితి కాస్త అదుపులో ఉన్నా.. సడలింపుల తర్వాత పరిస్థితి అదుపు తప్పింది. నగరంలో ఆరు ప్రధాన మార్కెట్లు ఉన్నాయి. గాంధీనగర్, కొత్తపేట, పెదమార్కెట్, జగన్నాథపురం చిన మార్కెట్, రమణయ్యపేట మార్కెట్లలోనూ నిత్యం రద్దీ కనిపిస్తోంది. మెయిన్‌రోడ్డు, దేవాలయం వీధి, సినిమా రోడ్డు, కల్పనా కూడలి ఎక్కువ రద్దీగా ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో ప్రజలు కనీస జాగ్రత్తలు పాటించకపోవడమే వైరస్‌ వ్యాప్తికి కారణమయ్యింది. మద్యం దుకాణాల వద్ద బారులు, ఇతర ప్రాంతాల్లో గుమిగూడి కార్యకాలాపాలూ ఓ కారణంగా కనిపిస్తోంది. జిల్లా కేంద్రంలో కరోనా పరీక్షలకు, సేవల కోసం వస్తున్న వారి అజాగ్రత్తలూ ఇరకాటంలో పడేస్తుంది.

రాజుకున్న రాజమహేంద్రవరం..

వాణిజ్య కేంద్రంగా పేరున్న రాజమహేంద్రవరం నగరంలో 50 డివిజన్లు ఉంటే.. 30 డివిజన్లలో వైరస్‌ తీవ్రత కనిపిస్తోంది. నగరంలోని 16, 17, 21, 29, 42, 43, 44, 45, 48, 49 డివిజన్లలో కేసులు ఎక్కువగా ఉన్నాయి.

కేసులకు కారణమిదే..

రాజమహేంద్రవరం నగరంలో తాడితోట, మెయిన్‌ రోడ్డు, ఎస్వీజీ మార్కెట్లకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి తాకిడి ఉంటుంది. నిత్యం బయట నుంచే లక్ష మందికి పైగా వస్తారు. ప్రధానంగా కంబాల చెరువు, దేవీచౌక్, మెయిన్‌రోడ్డు, డీలక్స్‌ సెంటరు, తాడితోట, బైపాస్‌ తదితర రోడ్లు నిత్యం రద్దీగా ఉంటాయి. నిత్యావసరాలు, ఇతర వ్యాపారాల సముదాయాల వద్ద ప్రజలు కనీస జాగ్రత్తలు పాటించకపోవడం వైరస్‌ వ్యాప్తికి కారణమవుతోంది. ఇతర ప్రాంతాల నుంచి కొనుగోళ్లకు, వైద్యసేవల కోసం వస్తున్న వారితోపాటు స్థానికుల అజాగ్రత్తతో మూల్యం చెల్లించాల్సి వస్తోంది.

మొదట్నుంచీ హెచ్చరిస్తున్నాం..

కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల్లో కొవిడ్‌ కేసుల తీవ్రత ఎక్కువ ఉంటుందనే సంకేతాలు ముందు నుంచే ఉన్నాయి. కరోనా కట్టడికి అన్ని చర్యలూ తీసుకుంటున్నాం.లాక్‌డౌన్‌కు ముందు నుంచే పరిస్థితిపై ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నాం. కానీ కొందరి నిర్లక్ష్యం వైరస్‌ వ్యాప్తికి కారణమయ్యింది. ఇప్పటికైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య వసతులు తక్కువ. వారీలో లక్షణాలుంటే ముందుగానే అప్రమత్తమై వైద్యులను ఆశ్రయిస్తున్నారు. నగరాల్లో ఆ పరిస్థితి లేదు. సొంత వైద్యమో, ఆర్‌ఎంపీలనో ఆశ్రయించి పరిస్థితి చేయిదాటే వరకు గోప్యంగా ఉంచుతున్నారు. రాజమహేంద్రవరంలో ఇలాంటి పరిస్థితి ఉంది. రెండు, మూడు రోజల కంటే ఎక్కువ రోజులు జ్వరం ఉన్నా.. శ్వాస సంబంధిత ఇబ్బందులు ఎదురైనా, ఆక్సిజన్‌ స్థాయి 94 కంటే తక్కువ ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి. - డి.మురళీధర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌

ఇదీ చదవండి:సెప్టెంబరు 20 నుంచి గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు

ABOUT THE AUTHOR

...view details