Area Hospital in Amalapuram: సర్కారు ఆసుపత్రుల్లో రోగులకు ఆహారం సప్లై చేసే కాంట్రాక్టర్లకు.. ఏడాదిన్నర కాలంగా బిల్లులు చెల్లించకపోవడంతో విసుగు చెందిన గుత్తేదారు.. ఆహారం పంపిణీ చేయడం మానేశాడు. దీంతో రెండు రోజులుగా తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని ఏరియా ఆసుపత్రిలో రోగులకు భోజనం అందట్లేదు.
కోనసీమ ప్రాంతంలో ఏకైక ఏరియా ఆసుపత్రి అమలాపురంలో ఉంది. ఇక్కడున్న వంద పడకల ఆసుపత్రికి.. ఔట్ పేషెంట్లతోపాటు భారీ సంఖ్యలో గర్భిణులు ప్రసవం కోసం వస్తుంటారు. అలాగే.. ఇతర శాస్త్ర చికిత్స కోసమూ ఎక్కువగానే రోగులు ఈ ఆసుపత్రిలో ఇన్ పేషెంట్‌గా జాయిన్ అవుతుంటారు.
ఈ ఆసుపత్రిలో గర్భిణులు, బాలింతలు, ఇతర రోగులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం అందిస్తారు. భోజనం అందించే బాధ్యతను ఓ కాంట్రాక్టరుకు అప్పగించింది సర్కారు. అయితే.. గత ఏడాది జూన్ నుంచి ఆహారం సప్లై చేస్తున్న గుత్తేదారుడికి.. ప్రభుత్వం దాదాపు పదిహేను లక్షల రూపాయల బకాయి ఉంది.
ఈ డబ్బుల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నా.. ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు. దీంతో.. ఇక తనవల్ల కాదంటూ ఈనెల 1వ తేదీ నుంచి ఆసుపత్రిలో రోగులకు ఆహారం పంపిణీ చేయడం మానేశాడు. ఫలితంగా.. రోగులు బయట హోటల్స్ మీద ఆధారపడుతున్నారు.
ఇదీ చదవండి:TDP MPs Fires on YSRC MPs: 'వైకాపా ఎంపీలు పార్లమెంటు సాక్షిగా.. రాష్ట్రం పరువు తీశారు'