ఆక్వా చెరువులను పరిశీలించిన కలెక్టర్ - aqua
తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం భీమనపల్లిలో ఆక్వా చెరువులను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఆక్వా చెరువుల వల్ల తాము పడుతున్న అవస్థలపై సోమవారం కాకినాడలో స్పందన కార్యక్రమంలో స్థానికులు ఫిర్యాదు చేయడంతో స్పందించిన కలెక్టర్ స్వయంగా అక్కడికి వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు.
సోమవారం స్పందన కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఆక్వా చెరువులను ఆకస్మికంగా పరిశీలించారు. ఆక్వా చెరువుల వల్ల జలాలు పూర్తిగా కాలుష్యమై.. తామంతా రోగాల భారిన పడుతున్నామని కలెక్టర్ వద్ద జనం తమ గోడు చెప్పుకున్నారు. అనంతరం మత్స్యశాఖ, జిల్లా అధికారులు, స్థానిక రెవెన్యూ, పోలీసులతో కలిసి ప్రజల నుంచి వివరాలు సేకరించారు. ఆక్వా సాగుదారులు మాత్రం తాము కోర్టు నుంచి అనుమతులు పొంది సాగు చేస్తున్నామని నిబంధనలు ఉల్లంఘించలేదని తెలిపారు. కలెక్టర్ వెళ్లిపోయిన తర్వాత... సాగుదారులకు, స్థానికులకు మధ్య వాగ్వాదం జరిగింది. జనం నుంచి సమాచారం సేకరించిన జిల్లా అధికారులు కలెక్టర్‌కు నివేదిస్తామని తెలిపారు.