chandrababu on cid case: మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి ఆప్పారావుతో పాటుగా ఆయన కుమారుడు ఆదిరెడ్డి వాసు ఇద్దరిని సీఐడీ పోలీసులు అరెస్టు చేయడాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఖండించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. రాష్ట్రంలో రోజు రోజుకూ వైసీపీ రాజకీయ వేధింపులు, కక్ష సాధింపులు పెరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రత్యర్థులను ఓడించడానికి పాలనను నమ్ముకోవాల్సిన ప్రభుత్వం, అక్రమ కేసులను,అరెస్టులను మాత్రమే నమ్ముకుంటుందని ఆక్షేపించారు. తాజాగా అరెస్టులే.. అందుకు సాక్ష్యమని ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామాల్లో ఉన్న తెలుగు దేశం కార్యకర్తల నుంచి, రాష్ట్ర స్థాయి నేతల వరకు ప్రతి ఒక్కరినీ కేసులతో, దాడులతో భయపెట్టి లొంగదీసుకోవాలనే దుష్ట ఆలోచనలు ప్రభుత్వం మానుకోవాలని హితవుపలికారు. సీఐడీ అనేది దర్యాప్తు ఏజెన్సీనా లేక వైసీపీ వేధింపుల ఏజెన్సీనా అని ప్రశ్నించారు.
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి: రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త శ్రీనివాస్, మామ అప్పారావుల అక్రమ అరెస్టును తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అరాచకాలు, కక్షసాధింపులు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయని వాపోయారు. జగన్ రెడ్డి సంపాదించిన లక్ష కోట్ల అక్రమాస్తులపై యర్రన్నాయుడు కేసు వేయడంతో వారి కుటుంబంపై కక్ష కట్టాడని దుయ్యబట్టారు.
కొల్లు రవీంద్ర: జగన్ అధికార దోరహంకారానికి నిదర్శనం తన జేబు సంస్థ సిఐడి తో బీసీలపై అక్రమ కేసుల నమోదు చేస్తున్నాడని మాజీమంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. బడుగు బలహీన వర్గాల నేత బీసీల అభ్యున్నత కోసం అనేక పోరాటాలు చేసిన ఆదిరెడ్డి అప్పారావు అరెస్టును, ఆదిరెడ్డి వాసు పై అక్రమ కేసును ముక్తకంఠంతో ఖండిస్తున్నామని తేల్చిచెప్పారు. తక్షణమే భేషరతుగా ఆదిరెడ్డి అప్పారావు ని ఆదిరెడ్డి వాసుని విడుదల చేయకపోతే బీసీల తిరుగుబాటు ఈ ప్రభుత్వంపై తప్పదని హెచ్చరించారు.