తూర్పుగోదావరి జిల్లా పాపికొండల పర్యాటకంలో పెను విషాదం జరిగింది. గోదావరిలో బోటు ప్రమాదానికి గురై నిండు ప్రాణాలు నీటమునిగాయి. పోలవరం మండలం సింగనపల్లి రేవు నుంచి 73 మందితో బయలుదేరిన రాయల్ వశిష్ట బోటు ఉగ్ర గోదావరిలో ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ప్రయాణం మొదలుపెట్టింది. ఈ క్రమంలో దాదాపు 2 గంటలపాటు ప్రయాణించిన తర్వాత.. అత్యంత ప్రమాదకరమైన సుడులు ఉండే కచ్చలూరు మందం వద్దకు చేరుకుంది. ఆ సమయంలో జాగ్రత్తగా ఉండాలని పర్యాటకులకు బోటు సిబ్బంది హెచ్చరికలు జారీచేశారు. ఈ హెచ్చరికలు జారీ చేసిన నిమిషాల వ్యవధిలో బోటు ప్రమాదం జరిగింది. వాస్తవానికి బోటు నదికి ఓ వైపుగా వెళ్లాల్సి ఉండగా సారంగి నది ఉరవడి మధ్యలో నుంచి తీసుకెళ్ళే ప్రయత్నం చేశాడని అప్పుడే స్టీరింగ్ ఇంజిన్ వైరు తెగి బోటుపై సారంగి పట్టుకోల్పోయాడని తెలుస్తోంది. ఆ సమయంలోనే బోటు ఓ వైపునకు పడిపోయి నిమిషాల వ్యవధిలో మునిగిపోయింది. పడవ మునిగే సమయానికి ఎవరి దగ్గరా లైఫ్‌జాకెట్లు లేనట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి 26 మందిని రక్షించారు. 39 మంది ఆచూకీ గల్లంతైంది. ఇప్పటి వరకూ 8 మృతదేహాలను బయటకు తీశారు. గల్లంతైన వారు కొట్టుకుపోకుండా ధవళేశ్వరం గేట్లను అధికారులు కిందకు దించారు.
స్థానికులు..లేకపోతే..మరీ దారుణం!
పర్యటకుల్లో లైఫ్ జాకెట్లు ధరించిన వారు నదిలో కొట్టుకుపోవడాన్ని గమనించిన తూటుగుంట గ్రామస్థులు పడవల్లో వెళ్లి వారిని రక్షించారు. అనంతరం ఒడ్డుకు చేర్చి వారిని రంపచోడవరం ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారు గల్లంతయ్యారు. స్థానికులు స్పందించి ఉండకపోతే ఇంకా ఎక్కువ మంది మృతి చెందే వారని బాధితుడొకరు తెలిపారు.
తెలంగాణ వాసులే ఎక్కువ
ప్రమాదం జరిగే సమయానికి బోటులో ఆరుగురు పడవ సిబ్బంది, ముగ్గురు డ్యాన్సర్లు, 64 మంది పర్యటకులు ఉన్నారు. వీరిలో హైదరాబాద్ నుంచి వచ్చిన వారు 22 మంది, వరంగల్ నుంచి 14 మంది, విశాఖ నుంచి 12 మంది, కృష్ణాజిల్లా హనుమాన్‌జంక్షన్ నుంచి ఆరుగురు, తిరుపతి నుంచి ముగ్గురు, నరసాపురం, గుంటూరు జిల్లా నుంచి మరికొందరు ఉన్నారు. బోటు ప్రమాదంలో మొత్తం 47 మంది నీట మునగ్గా వీరిలో 8 మంది మృతదేహాలను వెలికితీశారు. బోటు సిబ్బందిలో డ్రైవర్లు నూకరాజు, తామరాజుతో పాటు సహాయకుడు మణికంఠ చనిపోయారు. పర్యటకుల్లో హనుమాన్‌జంక్షన్‌కి చెందిన నడికుదురు శ్రీనివాస్, సలీం, తాడేపల్లి నులకలపేకు చెందిన కృష్ణకిషోర్, నరసాపురంకి చెందిన వలవల రఘు, గన్నాబత్తుల బాలు మృతిచెందారు. వీరి మృతదేహాలను రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం నుంచి బయటపడిన వారిని దగ్గర్లో రంపచోడవరం ఆస్పత్రికి తరలించారు
సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు