TDP state President Atchennaidu Fire On CM Jagan: తెలుగుదేశం పార్టీని ఎదుర్కొలేక కోడి కత్తి డ్రామా, సొంత బాబాయిని చంపి ప్రజల సింపతితో జగన్ సీఎం అయ్యారని టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆరోపించారు. వైఎస్ వివేకా చనిపోయిన విషయం జగన్‌కు ముందు తెలిసిందన్న ఆయన... బాబాయ్ హత్య కేసు తన మీదకే వస్తుందని భయపడుతున్నారని అన్నారు. 2 వేల రూపాయల నోట్ల రద్దుతో తన దగ్గరున్న నోట్లను ఏం చేయాలో తెలియక జగన్ తల పట్టుకున్నారన్నారు.
సీఎం జగన్‌ను వేటాడి.. వెంటాడి తరిమి కొట్టే రోజులు వచ్చాయని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. 151 స్థానాలు రావడంతో జగన్‌కు కళ్లు నెత్తికెక్కాయని అన్నారు. ఇంత అనుభవమున్న పార్టీ అయినా సరే గత నాలుగేళ్లల్లో ఎన్నో కష్టాలు పడ్డామని తెలిపారు. ఏపీలోని ఐదు కోట్ల మంది ప్రజలు వైసీపీని ఛీకొడుతున్నారని అన్నారు. 28 రాష్ట్రాల సీఎంలకు 508 కోట్లు ఉంటే.. జగన్ ఒక్కడికే అంత ఆస్తి ఉంటుందని అన్నారు. ఉత్తరాంధ్రని ఉద్ధరిస్తానంటూ విశాఖలో రాజధాని పెట్టి అక్కడో ఇల్లు కడతాడంట అంటూ అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు.
అరాచక పాలన సాగిస్తున్న జగన్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పనిచేద్దామని.. పార్టీ నాయకులు, కార్యకర్తలకు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. నాలుగేళ్లుగా ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదిరించి నిలబడ్డారని.. నాయకులు, కార్యకర్తలను అభినందించారు. వచ్చే ఎన్నికలదాకా ఇదే పోరాట స్ఫూర్తితో పనిచేయాలని కోరారు. రాజధాని పేరిట ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్న జగన్‌ను.. ప్రజలంతా కలసికట్టుగా రాష్ట్రం నుంచి తమిరికొట్టాలన్నారు. మళ్లీ తెలుగుదేశాన్ని గెలిపిస్తే.. రాష్ట్రానికి స్వర్ణయుగం తిరిగొస్తుందని అన్నారు.