ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

No Buses to TDP Mahanadu: అధికార పార్టీకేమో అడిగినన్ని.. మహానాడుకు మాత్రం తాత్సారం! - apsrtc not allot buses to tdp mahanadu 2023

No Buses to TDP Mahanadu: తెలుగుదేశం మహానాడుకు ఆర్టీసీ బస్సులు కేటాయించకుండా APSRTC దోబూచులాడుతోంది. గతంలో వైసీపీ ప్లీనరీకి 1వెయ్యి 812 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసిన RTC.. మూడు, నాలుగు రోజులుగా టీడీపీ నేతలు అడుగుతున్నా ఇవ్వడం లేదు. బస్సుల కేటాయింపుపై స్పష్టత ఇవ్వకుండా ఆర్టీసీ అధికారులు తాత్సారం చేస్తున్నారు.

No Buses to TDP Mahanadu
No Buses to TDP Mahanadu

By

Published : May 26, 2023, 9:07 AM IST

అధికార పార్టీకేమో అడిగినన్ని.. మహానాడుకు మాత్రం తాత్సారం!

No Buses to TDP Mahanadu: ఏ పార్టీ అయినా, సంస్థ అయినా, వ్యక్తులైనా.. తమ సొంత కార్యక్రమాలు, వేడుకలు, సభలకు RTC ఆర్టీసీ బస్సులు కావాలంటే అడ్వాన్స్‌ను ముందే చెల్లించి, బుక్‌ చేసుకోని తీసుకోవచ్చని.. గత సంవత్సరం వైసీపీ ప్లీనరీకి 1వెయ్యి 812 బస్సులను పంపడంపై ఆ సంస్థ అధికారులు వివరణ ఇచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న మహానాడుకి ఆర్టీసీ బస్సులను ఇవ్వకుండా యాజమాన్యం దాటవేత ధోరణిలో వ్యవహరిస్తోంది.

ఒక బస్‌ కూడా బుక్‌ చేసుకోనివ్వకుండా ఉద్దేశపూర్వకంగా తాత్సారం చేస్తోంది. వేర్వేరు నియోజకవరాల నుంచి పార్టీ శ్రేణులను మహానాడుకి తీసుకెళ్లేందుకు నేతలు ఆర్టీసీ బస్సుల కోసం మూడు, నాలుగు రోజులుగా ప్రయత్నిస్తున్నారు. అక్కడి మేనేజర్లతో సంప్రదింపులు చేస్తున్నారు. తమకు ఎన్ని బస్సులు కావాలో, వాటిని బుక్‌ చేసుకునేందుకు ఎంత అడ్వాన్స్‌ చెల్లించాలో చెప్పాలని కోరుతున్నారు. డిపో మేనేజర్లు మాత్రం దీనిపై స్పష్టత ఇవ్వడంలేదు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాలేదని చెబుతున్నారు. RTC బస్సులు బుక్‌ చేసుకోనివ్వకపోవడంతో.. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుకి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ కూడా రాశారు. అయినా సరే ఆర్టీసీ అధికారుల్లో చలనం లేదు.

గత ఏడాది జులైలో గుంటూరు సమీపంలో నిర్వహించిన ప్లీనరీకి.. దాదాపు 2 వేల బస్సులను వైసీపీ బుక్‌చేసుకుంది. ఇందులో 1వెయ్యి 812 బస్సులను వైసీపీ నేతలు వినియోగించుకున్నారు. ప్రయాణికుల అవస్థలను ఏమాత్రం పట్టించుకోకుండా.. బస్సులన్నీ ప్లీనరీకి పంపారు. ఇపుడు టీడీపీ నిర్వహిస్తున్న మహానాడుకి మాత్రం బస్సులు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. గత సంవత్సరం ఒంగోలులో నిర్వహించిన మహానాడుకి సైతం ఆర్టీసీ బస్సులను బుక్‌చేసుకోనివ్వలేదు. కొన్ని డిపోల మేనేజర్లు అడ్వాన్స్‌ తీసుకొని, బస్సులు పంపేందుకు సిద్ధమైనా ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో ఆ సొమ్ముని వెనక్కి ఇచ్చేశారు.

అమరావతిలో ఇవాళ జరిగే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బస్సులు సిద్ధం చేశారు. సీఎం సభ కోసం ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి 300, ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి 310, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల నుంచి 20 చొప్పున 60 బస్సులు, పశ్చిమగోదావరి జిల్లా నుంచి 45, ఏలూరు జిల్లాల నుంచి 60 బస్సులు.. కలిపి మొత్తంగా 775 బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఈ నెల 24న కొవ్వూరులో సీఎం పాల్గొన్న విద్యాదీవెన సభ కోసం.. కాకినాడ, తూగో, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల నుంచి 40 చొప్పున 120 బస్సులు, పశ్చిమ గోదావరి నుంచి 40, ఏలూరు జిల్లా 35 ఆర్టీసీ బస్సులు పంపారు. కానీ రాజమహేంద్రవరంలోని టీడీపీ మహానాడుకి మాత్రం ఒక్క RTC బస్సు కూడా ఇవ్వకుండా అధికారులు ముఖం చాటేస్తున్నారు.

ప్రైవేటు విద్యా సంస్థల బస్సుల పైనా ఆంక్షలు విధిస్తున్నారు. రవాణా శాఖ అధికారులు, వైసీపీ నేతలు.. విద్యాసంస్థల యాజమాన్యాలను హెచ్చరిస్తున్నారు. వేసవి సెలవుల్లో బస్సులను ఎలా బయటకు తీస్తారని, ఫిట్‌నెస్‌ తనిఖీలు జరిపి, జరిమానాలు విధించేలా చూస్తామని హెచ్చరిస్తున్నారు. అడ్డంకులు ముందే గుర్తించిన విశాఖ, అనకాపల్లి జిల్లాల టీడీపీ నాయకులు ప్రైవేటు బస్సులు, ఇతర వాహనాలు సమకూర్చుకున్నారు. అల్లూరి, విజయనగరం,పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాల నుంచీ ప్రైవేట్‌ వాహనాల్లోనే రాజమహేంద్రవరం చేరుకునేలా ఏర్పాట్లు చేసుకున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details