తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణం వైభవోపేతంగా జరిగింది. సర్వాంగ సుందరంగా తయారుచేసిన కల్యాణ మండపంలో.. వేదపండితుల మంత్రోచ్ఛారణలతో.. వేలాది భక్తజనం నడుమ సత్యదేవుని వివాహ మహోత్సవం కన్నులపండువగా సాగింది. ముందుగా స్వామివారిని, అమ్మవారిని ఊరేగింపుగా మండపం వద్దకు తీసుకువచ్చారు. అనంతరం కల్యాణ తంతు జరిపించారు. భక్తులు పెద్దఎత్తున హాజరై కల్యాణోత్సవాన్ని తిలకించారు.
కలెక్టర్ కార్తికేయ మిశ్రా దంపతులు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం నుంచి సత్యదేవునికి పట్టువస్త్రాలు కానుకలుగా అందాయి. విద్యుత్ దీప కాంతులతో సత్యదేవుని ఆలయ ప్రాంగణం కాంతులీనింది. కల్యాణ వేదికకు దూరంగా ఉన్న భక్తులకు వివాహ దర్శన భాగ్యం కల్పించేందుకు ఎల్ఈడీ టీవీలు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో పంకాలు, కూలర్ల సౌకర్యం కల్పించారు.