పెద్ద పెద్ద గుంతలు... చిన్న చిన్న చెరువులు... అక్కడక్కడా పగుళ్లు... ఉయ్యాల్లో ఉగుతున్న అనుభూతి... ఏమిటీ వర్ణన అనుకుంటున్నారా...! రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలపై వెళ్తునప్పుడు ఇలానే ఉంటుంది. ఇలాంటి రోడ్లపై వెళ్లేటప్పుడు వాహనాలు త్వరగానే మూలన పడటం ఖాయం. వాహనాలు సంగతి పక్కన పెడితే... అప్పుడప్పుడూ జరిగే ప్రమాదాల్లో మనుషుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.
కష్టాలు అనంతం
అనంతపురం జిల్లా కదిరిలోని రహదారుల పరిస్థితి చూద్దాం... అడుగు లోతు పడిన గుంతలు పగటి పూటే వాహన చోదకులకు చుక్కలు చూపిస్తున్నాయి. చిన్న వర్షం వచ్చినా రోడ్లు పిల్ల కాలువల్లా మారిపోతాయి. ఇక పాదచారులకు తిప్పలు తప్పటం లేదు. పిల్లలు నీటికుంటల్లో పడే ప్రమాదం ఉందని స్థానికులు భయపడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా చర్యలు తీసుకోలేదు.
ఈత రాకుంటే..
విశాఖ జిల్లా పెదబయలు మండలం చెక్కరాయి బొండా పుట్టు గ్రామాలకు వెళ్లాలంటే ఈత నేర్చుకోవాల్సిందే... నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా ఇదే దిక్కు. రహదారి సదుపాయం లేక చినుకు పడితే అస్పత్రికి వెళ్లలేక జనం మృత్యువాతపడుతున్నారు.
ఊయల వంతెన
కృష్ణా జిల్లా కంకిపాడు - గన్నవరం మార్గంలో ఉప్పలూరు గ్రామం వద్ద ఉన్న వంతెన పరిస్థితి అంతే. కూలడానికి సిద్ధంగా ఉన్న ఈ వారధిపై పది గ్రామాల వారు... మచిలీపట్నం వైపు నుంచి గన్నవరం వెళ్లే వారు ప్రయాణిస్తారు. వంతెన బలహీనంగా ఉన్నా భారీ వాహనాలను అనుమతిస్తున్నారు. కొంతమంది స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేదంటున్నారు.