అత్యాచార బాధితులకు ప్రభుత్వం ఏదో మొక్కుబడిగా కొంత పరిహారం చెల్లించి చేతులు దులుపుకోవడం సరికాదన్నారు ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి. కచ్చితంగా ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం బాధితులకు ఉద్యోగం, భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిర్భయ చట్టం ప్రకారం నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. రాష్ట్రంలో పలుచోట్ల అత్యాచారాలకు గురైన బాధితులను కలుస్తూ.. వారికి అండగా ఉండి పోరాడేందుకు పర్యటన చేస్తున్నామన్నారు.
మహిళల ఓట్లతో గెలిచి వారిపై దాడులు జరిగితే పట్టించుకోకపోవడం ఏంటని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికే పరిమితమయ్యారని.. పోలీసులు అడ్డం పెట్టుకుని ప్రశ్నించే గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు.
రాజధాని ప్రాంతంలో ఏదైనా ఘటన జరిగితే స్పందించినట్టుగా.. రాష్ట్రంలో మరోచోట జరిగితే ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గ భవాని. డీజీపీ అధికార పార్టీకి అండగా ఉండటం తప్ప.. శాంతి భద్రతలను పట్టించుకోవడం లేదని ఆగ్రహించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అత్యాచారాలు జరుగుతున్నా కనీసం ప్రభుత్వం మహిళా కమిషన్, మహిళా సంఘాలతో చర్చలు జరపడం లేదన్నారు.
ఐద్వా రాష్ట్ర మహిళా సమాఖ్య నాయకులు శనివారం సాయంత్రం మాజీ ఎంపీ హర్షకుమార్‌ను రాజమహేంద్రవరంలోని ఆయన నివాసం వద్ద కలిశారు. ఆయన మాట్లాడుతూ మధురపూడి అత్యాచార ఘటనను కోర్టు సుమోటోగా తీసుకోవాలని లేనిచో ఈ వారంలో తామే పిల్ వేస్తామన్నారు. ఈ సమావేశంలో భాజపా నాయకురాలు కొల్లివలస హారిక తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి : WORKERS PROBLEM IN GULF: సమస్యలు చెప్తే కొడుతున్నారు..బహ్రెయిన్‌లోని తెలుగు కార్మికుల వీడియో