ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గసగసాల కేసులో మరో ఇద్దరి అరెస్టు - chittor district madanapalle latest newd

చిత్తూరు జిల్లా మదనపల్లెలో సంచలనం సృష్టించిన మత్తు పంట సాగు కేసులో.. మరో ఇద్దరు నిందితులను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. నిందితులిద్దరు ముంబైకి చెందిన వారు కాగా.. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. వీరు ముంబై నుంచి విత్తనాలను మదనపల్లెకు రవాణా చేసి.. స్థానిక రైతుకు సాగు కోసం అందించినట్లు పోలీసులు గుర్తించారు.

poppy seeds case
గసగసాల కేసులో మరో ఇద్దరి అరెస్టు

By

Published : Apr 6, 2021, 10:26 AM IST

గుట్టుచప్పుడు కాకుండా పంట పొలాల్లో డ్రగ్స్‌, మత్తు పదార్థాలకు వినియోగించే గసగసాలు(ఓపీఎం పాపీసీడ్స్‌) పంటను పండిస్తున్న పలువురిని ఎస్‌ఈబీ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అడిషనల్‌ ఎస్పీ రిశాంత్‌రెడ్డి ఆదేశాల మేరకు మదనపల్లెలో ప్రారంభమైన విచారణ ముంబయి వరకు చేరింది. ఈ కేసులో ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేసిన ఎస్‌ఈబీ పోలీసులు సోమవారం ముంబయికి చెందిన భార్యాభర్తలను అరెస్టు చేశారు. సీఐ కథనం మేరకు.. గ్రామీణ మండలం మాలేపాడు పంచాయతీ దేవళంపల్లె సమీపంలో గతనెలలో గసగసాల సాగు చేస్తున్నట్లు గుర్తించి పంటను ధ్వంసం చేశారు.

ఈ కేసులో నిందితులైన నాగరాజు, లక్ష్మన్న, సోమశేఖర్‌లను అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారం మేరకు.. చౌడేపల్లె మండలం గుట్టకిందపల్లెకు చెందిన వెంకటరమణ, రేవణ్‌కుమార్‌లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 18.10 కిలోల గసగసాల కాయల పొట్టును స్వాధీనం చేసుకొని రిమాండుకు తరలించారు. వీరిని పోలీస్‌ కస్టడికి తీసుకొని విచారణ చేయగా తెలంగాణ రాష్ట్రంలోని కందుకూరులో కూడా పంట సాగు చేస్తున్నట్లు గుర్తించి అక్కడ పంట పెట్టిన చెన్నకేశవను అరెస్టు చేశారు. వీరిలో వెంకటరమణకు ముంబయికి చెందిన మహిళ విత్తనాలు తెచ్చి ఇచ్చినట్లు నిర్ధారించుకుని ఓ బృందం ముంబయికి వెళ్లి నిందితురాలైన బొంబాయి కృష్ణమ్మ అలియాస్‌ భూమ్మ(50) ఆమె భర్త బల్కర్‌సింగ్‌ (60)లను రెండో రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి మదనపల్లెకు తీసుకొచ్చి సోమవారం అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టుల సంఖ్య 8కి చేరిందని సీఐ తెలిపారు. కృష్ణమ్మ, బల్కర్‌ సింగ్‌ వెనుక ఎవరెవరూ ఉన్నారో విచారణ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి:బెంగళూరులో విశాఖ మత్తు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details