తితిదేలో రోజుకో వివాదం బయటపడుతోంది. ఖజానా నుంచి ఐదుకేజీల వెండి కిరీటం, రెండు బంగారు ఉంగరాలు, రెండు హారాలు మాయమయ్యాయన్న వార్త.. మరో వివాదానికి దారి తీసింది. మొత్తం వ్యవహారంలో సుమారు 7లక్షల 36 వేల విలువైన ఆభరణాలు మాయమయ్యాయి. ఈ సంగతి 2018 మే 5నే తితిదే దృష్టికి రాగా... అప్పటి ట్రెజరీ ఏఈవోగా ఉన్న శ్రీనివాసులు జీతం నుంచి మాయమైన అభరణాల విలువను వసూలు చేస్తున్నారన్న విషయం బయటపడింది. అసలు నగలను ఎవరు మాయం చేశారన్న వ్యవహారంపై పెద్ద దుమారమే చెలరేగింది. ఏడాదిగా వ్యవహారం నడుస్తున్నా.. తితిదే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచటంపై సర్వత్రా విమర్శలు ఎదరవుతున్నాయి.
హైకోర్టు న్యాయమూర్తితో విచారణ చేపట్టాలి: భాజపా
ఆభరణాల మాయం వ్యవహారాన్ని ఖండించిన భాజపా రాష్ట్ర కార్యదర్శి, తితిదే పాలకమండలి మాజీ సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి విలేకర్ల సమావేశం నిర్వహించారు. తితిదే అవలంబిస్తున్న విధానాన్ని తప్పు పట్టారు. వ్యవహారంలో ఒక్క ఏఈవోనే బాధ్యుడ్ని చేయటం భావ్యంగా లేదన్నారు. అన్ని ఆభరణాలు ఒకే వ్యక్తి ఎలా మాయం చేస్తారంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. అసలు ఈ ఆభరణాల మాయం వ్యవహారంలో ఏం జరిగిందో తితిదే ఈవో వివరణ ఇవ్వాలని కోరారు.