భక్తులతో కళకళలాడే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల...చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భక్తులు లేక వెలవెలబోతోంది. కరోనా వ్యాప్తి దృష్ట్యా తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలు నిలిపివేశారు. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం తర్వాత భక్తులను దర్శనాలకు అనుమతించడం లేదు. స్వామివారికి ఏకాంతంగా ఆర్జిత సేవలు, కైంకర్యాలు కొనసాగుతున్నాయి. తిరుమలతోపాటు తితిదే అనుబంధ ఆలయాల్లోనూ దర్శనాలు నిలిచిపోయాయి.
జూపార్కు మూసివేత
కరోనా కారణంగా ఈ నెల 31 వరకు తిరుమల, తిరుపతి బస్టాండు, రైల్వేస్టేషన్‌లోని దుకాణాలు మూసివేశారు. నిత్యం రద్దీగా ఉండే దుకాణాలు మూసివేయటంతో.... ఆ ప్రాంతమంతా బోసిపోయింది. తిరుపతి జూపార్కు కూడా మూసివేశారు. తిరుమలలో వివాహం చేసుకునే జంట సహా ఆరుగురికే అనుమతినిచ్చినట్లు అధికారులు తెలిపారు.